యలమంచిలి రూరల్: యలమంచిలి పట్టణంలో మంగళవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది.అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో వీచిన గాలి తీవ్రతకు ఇంటి ముందు ఎగిరి పడిన ఇనుప రేకును తొలగించబోయిన గృహిణి నున్న భాగ్యలక్ష్మి(51) ప్రాణాలు కోల్పోయింది. ఊహించని ఈ ఘటనతో వృద్ధురాలైన 85 ఏళ్ల తల్లి, అమాయకుడైన భర్త నాగరాజు ఆసరా కోల్పోయారు. స్థానికులు,పట్టణ పోలీసులు అందించిన వివరాలివి.. యలమంచిలి పట్టణం భవనం వీధిలో వేద పాఠశాల ఎదురుగా దివంగత బెల్లంకొట్టు నాగేశ్వరరావు కుంటుంబానికి చెందిన అతని రెండో కుమార్తె భాగ్యలక్ష్మి, ఆమె భర్త నాగరాజు, 85 ఏళ్ల భాగ్యలక్షి తల్లి నివాసముంటున్నారు. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో పెద్ద శబ్దం రావడంతో నాగరాజు బయటకు వచ్చి చూడగా పక్కనున్న ఓ దుకాణం నుంచి పెద్ద రేకు ఇంటి ముందు రోడ్డుపై పడినట్టు చూసి, దానిని తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు. ఇంతలో భాగ్యలక్ష్మి వచ్చి ఇనుప రేకును తొలగించడానికి దానిని తాకగానే విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. గాలికి తీవ్రతకు ఎగిరిపడిన ఇనుపరేకు అక్కడున్న విద్యుత్ స్తంభంపై పడి సరఫరా ఉన్న తీగ తెగిపడింది. ఇనుప రేకు కింద సరఫరా ఉన్న విద్యుత్ వైరు కనిపించకపోవడంతో భాగ్యలక్ష్మి విద్యుదాఘాతానికి గురైంది. అంతకుముందు ఆమె భర్త ఇనుప రేకును తొలగించడానికి ప్రయత్నించినపుడు విద్యుత్ సరఫరా లేకపోవడం,కొద్ది సమయంలోనే విద్యుత్ సరఫరా జరగడంతో అదొక మృత్యు వలయంగా మారింది. భాగ్యలక్ష్మి రేకును తాకగానే విద్యుదాఘాతానికి గురై కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. దీనిపై మృతురాలి భర్త నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్‌ఐ కె.సావిత్రి తెలిపారు. శవపంచనామా, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.అప్పటివరకూ తమ కళ్ల ముందే ఉన్న భాగ్యలక్ష్మి క్షణాల్లో విద్యుదాఘాతానికి గురై విగతజీవిగా మారడాన్ని భర్త నాగరాజు,ఆమె తల్లి తట్టుకోలేకపోయారు.ఎంత పని చేశావు దేవుడా.. అంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికులను సైతం కలచివేసిన ఈ విషాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


