ఈదురుగాలుల బీభత్సం
బోరున కురుస్తున్న వర్షం
నిలిచిన విద్యుత్ సరఫరా
అంధకారంలో పలు గ్రామాలు
జిల్లాలో పలు మండలాల్లో భారీ వర్షపాతం నమోదు
కశింకోటలో అత్యధికంగా 131.3 మి.మీ. వర్షపాతం
రానున్న రెండురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం
అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
కలెక్టర్ విజయకృష్ణన్
సాక్షి, అనకాపల్లి : జిల్లాను అర్నబ్ తుపాను వణికిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. రోజంతా భోరున వర్షం కురవడంతో పాటు గాలులు బలంగా వీచడంతో పలు చోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు మండలాల్లో గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. బుధవారం తెల్లవారు జామున అర్నబ్ తుపాను తీరం దాటే అవకాశం ఉన్నందున జిల్లాలో ఉదయం 11 గంటల వరకూ అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావొద్దని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రజలకు సూచించారు. రాత్రి 9 గంటలకు నమోదయిన వివరాల మేరకు అనకాపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో 120 మి.మీ, కశింకోట ప్రాంతాల్లో 131.3 మి.మీ వరకూ వర్షపాతం నమోదయ్యింది.
తుమ్మపాల : పలు మండలాల్లో మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు భారీ వర్షపాతం నమోదైందని జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ తెలిపారు. అనకాపల్లి మండలం కోడూరు 90.08 మిల్లీమీటర్లు, పరవాడలో 88.05 మిల్లీమీటర్లు, కశింకోట 80.5, అచ్యుతాపురం 75.5, యలమంచిలి 74.3, చోడవరం 72.5, బుచ్చెయ్యపేట 66.8, కె.కోటపాడు 59.0, కోటవురట్ల 56.0, ఎస్.రాయవరం 56, రావికమతం 55.3, మాకవరపాలెం 52.8, నాతవరం 51.0, మునగపాక 50.3, దేవరాపల్లి 49.3, నక్కపల్లి 48.0, పాయకరావుపేట 46.3, నర్సీపట్టణం 40.0, రోలుగుంట 39.3, మాడుగుల 38.0, గొలుగొండ 30.3, రాంబిల్లి 15.3, చీడికాడ 15.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రేకుల షెడ్‌పై కూలిన చెట్టు : ఇద్దరికి గాయాలు
రాంబిల్లి: మండలంలోని కుండలదేవునిపాలెంలో రేకుల షెడ్డుపై భారీ కొబ్బరిచెట్టు పడిపోయింది. ఇంట్లో వున్న నలుగురు బయటకు పరుగులు తీసారు. ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. దిమిలి ఉన్నత పాఠశాలలో మరో వృక్షం నేలకొరిగింది.
పూడిమడక తీరంలో ‘అల’కల్లోలం
అచ్యుతాపురం రూరల్ : పూడిమడక సముద్ర తీరంలో అలల ఉధృతి పెరిగింది. అలల నుంచి పడవలను కాపాడేందుకు మత్స్యకారులు తీవ్రంగా శ్రమి ంచారు. సీఐ చంద్రశేఖర్‌రావు సిబ్బందితో కలిసి పూడిమడక తీర ప్రాంతాన్ని సందర్శించి జాగ్రత్తలు వివరించారు.
యలమంచిలి రూరల్ : మండలంలో రేగుపాలెం హైవే కూడలి సమీపంలో భారీ వృక్షం హైవేపై కూలిపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రెవెన్యూ, పోలీసు అధికారులు హైవే నిర్వహణ సిబ్బందితో చెట్టును తొలగించేలా చర్యలు చేపట్టారు.
నక్కపల్లి : నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో ఈదురు గాలులు, వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాజయ్యపేట, బోయపాడు తీరాల్లో అలల ఉధృతికి సముద్రపు ఒడ్డు, ఇసుక తిన్నెలు కోతకు గురవుతున్నాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అప్రమత్తంగా యంత్రాంగం
తుమ్మపాల : ఆర్నబ్ తుపాను ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. తుపాను కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలోని ఆరు తీరప్రాంత మండలాల్లో వర్షాలు, ఈదురుగాలుల తీవ్రత పెరుగుతోందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావద్దని, ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని కోరారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు కలెక్టరేట్‌లో అన్ని శాఖల అధికారులతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చెట్లు పడిపోవడం, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత కంట్రోల్ రూమ్‌లను సంప్రదించాలని, అధికారులు అందించే సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.
కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు
08924-222888 08924-225999
08924-226599
రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూమ్‌లు
నర్సీపట్నం : 08932-224420
అనకాపల్లి : 08924-223316
అడ్డురోడ్డు : 08931-293606
విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్‌లు
కశింకోట: 83338 10597
అనకాపల్లి: 90631 10544
నర్సీపట్నం: 94910 30714


