యలమంచిలి రూరల్ : విశాఖ డెయిరీ సొమ్ముతో మున్సిపల్ ఎన్నికల్లో అడ్డదారిలో గెలవడానికి ప్రయత్నిస్తున్నారని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ తెలిపారు. మంగళవారం యలమంచిలి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. యలమంచిలి మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ చేస్తున్న పిళ్లా రమాకుమారి, ఆమె సోదరుడు విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్‌కుమార్, డెయిరీ ఎండీ ఎస్.వి.రమణలు ఎన్నికల్లో గెలవడానికి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు విశాఖ డెయిరీ ఉద్యోగులు, వాహనాలను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. సుమారు 200 మంది విశాఖ డెయిరీ ఉద్యోగులు యలమంచిలి పట్టణంలో వార్డుల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, డెయిరీ వాహనాల్లో నగదును పాలసేకరణ కేంద్రాలకు తరలించి అక్కడ్నుంచి ఓటర్లకు పంచిపెట్టడానికి చూస్తున్నారన్నారు. డెయిరీ సిబ్బందితో నగదు, మద్యం పంపిణీ చేయడానికి యత్నిస్తున్నారని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రతి రోజూ పట్టణంలో తులసీనగర్‌లో ప్రతి రోజూ వేల మందికి భోజనాలు పెడుతున్నారని, అధికారులు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. విశాఖ డెయిరీకి చెందిన నగదు, పాల ఉత్పత్తులు, సిబ్బంది, వాహనాలను పిళ్లా రమాకుమారి, ఆడారి ఆనంద్‌కుమార్‌లు సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు.
యలమంచిలి మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతూ గెలవడానికి విశాఖ డెయిరీ ట్రస్టు నగదును ఖర్చు చేస్తూ ఓటర్లను ప్రభావితం చేయడానికి చూస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకుని యలమంచిలిలో ఎన్నికలు ప్రశాంతంగా,స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా చూడాలని ధర్మశ్రీ జిల్లా కలెక్టరును కోరారు.ఈ మేరకు రాతపూర్వక ఫిర్యాదును కలెక్టరుకు పంపించినట్టు చెప్పారు.


