అనకాపల్లి టౌన్ : విద్యార్ధులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారిలో సృజనాత్మకతను పెంపొందించేందుకు పి.ఆర్.టి.యు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాలల ప్రతిభాపాటవ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా విద్యాశాఖాధికారి జి.జి.ఎస్. నాగేశ్వరరావు తెలిపారు. స్ధానికంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా స్థాయి బాలల దినోత్సవ వేడుకలు–2026 సంబంధించిన కరపత్రాలను డీఈవో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్రలేఖనం, దేశభక్తి గీతాలు, క్విజ్, పద్యపఠనం, డిబేట్, వ్యాసరచన, విచిత్ర వేషధారణ, మట్టితో కాగితంతో కూడిన కళాకృతుల తయారీ, జానపద నృత్యాలు వంటి విభిన్న అంశాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పి.ఆర్.టి.యు జిల్లా అధ్యక్షుడు డి.గోపినాఽథ్ మాట్లాడుతూ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 13 వరకు నర్సీపట్నం మొయిన్‌రోడ్‌లో, శ్రీకృష్ణ ప్యాలెస్ పక్కన్న నీట్ అకాడమీలో ఈ పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. నవంబర్ 14న బాలల దినోత్సవం నిర్వహించి పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షుడు కె.వి. రమణ, ఉపాధ్యక్షుడు ఎన్.ఎస్.రాజా, అర్బన్ ప్రధాన కార్యదర్శి అర్జున్, గొలుగొండ మండల ప్రధాన కార్యదర్శి రమణమూర్తి, కె.బాలకృష్ణ పాల్గొన్నారు.


