జీవీఎంసీ అనకాపల్లి జోన్‌లో అలజడి
గెలుపు కోసం కూటమి నేతల అతి
కూటమిలో చేరాలని వైఎస్సార్‌సీపీ నేతలపై ఒత్తిడి
చేరకుంటే ఇబ్బందులు తప్పవని బెదిరింపులు
అధికారుల సాయంతో కక్ష సాధింపు చర్యలు
సాక్షి, అనకాపల్లి : అనకాపల్లి జిల్లాలో జోరందుకున్న మున్సిపల్ ఎన్నికల్లో అనకాపల్లి జోన్ పరిధిలోని ఆరు వార్డుల్లో కూటమి నేతలు అరాచకాలకు తెరతీశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమికి చెందిన నేత వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని లక్ష్యంగా బెదిరింపులకు గురిచేస్తున్నారు. ప్రధానంగా 109, 110 వార్డుల పరిధిలో కూటమి నేతల అరాచకాలు తారస్థాయికి చేరాయి. అత్యంత సున్నితమైన గవరపాలెం కేంద్రంగా ఉన్న రెండు వార్డుల పరిధిలో ఇప్పటికే కూటమి నేతలు వైఎస్సార్‌సీపీ నేతల్ని తమ పార్టీలోకి రావాలని ఒత్తిడి చేయడంతో ఇద్దరు నేతలు రకరకాల కారణాలు చెప్పి కూటమి పార్టీల కండువా కప్పుకున్నారు. ఇంకా గెలుపు అవకాశాలను ప్రభావితం చేస్తారనే అక్కసుతో సుమారు 20,25 మంది వైఎస్సార్‌సీపీ నేతలపై కూటమి నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారు.
గతంలో లేని సంప్రదాయం..!
అనకాపల్లి జిల్లాలో ఒక సామాజిక వర్గం అధికంగా ఉన్న గవరపాలెంలో ఇద్దరు మాజీ మంత్రులు, ఒక మాజీ ఎంఎల్‌ఏ, ఒక మాజీ ఎంఎల్‌సీ, ఒక కార్పొరేషన్ చైర్మన్‌లు ప్రస్తుతం కూటమి పార్టీల్లోనే కొనసాగుతున్నారు. అయితే తాజా ప్రజా ప్రతినిధి బంధువు విధానాలతో విసిగిపోయిన స్థానికులు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నారు. ఇది తెలుసుకున్న కూటమి నేతలు బెదిరింపు ధోరణికి దిగుతున్నారు. సీట్ల కేటాయింపుల్లో సైతం మొదటి నుంచి కష్టపడిన వారిని పక్కన పెట్టిన స్థానిక కూటమి పెద్దలు పరిస్థితి చేజారుతుందని గ్రహించి బుజ్జగింపులకు దిగారు. ఈ నేపథ్యంలో కూటమి నేత బంధువు వ్యవహార శైలి ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. రెండు వార్డుల పరిధిలో సుమారు 26 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎవరికి వారు దూసుకువెళ్తుండగా, తాజాగా అధికార పార్టీ నేతల బెదిరింపుల ధోరణిపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహావేశాలతో ఉన్నారు.
సెట్‌బ్యాక్ కారణంగా చూపి
ఇంటిని కూల్చే కుట్ర..?
తాజా ప్రజా ప్రతినిధి హయాంలో మున్సిపల్ పాలకవర్గంలో కీలకమైన పదవిలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభిమాన నేతని ఇటీవల కూటమిలోకి రావాలని ఒత్తిడి చేశారు. తాను ససేమిరా అనడంతో ఇటీవల నిర్మించుకుంటున్న ఇంటికి సంబంధించి సెట్‌బ్యాక్ విషయంలో తెరమీదకు తెచ్చి కూల్చేందుకు సిబ్బంది చేరుకున్నారు. ఇది తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు అధికారుల తీరుని ఎండగట్టారు. మరో సహకార సంస్థ మాజీ చైర్మన్‌ను కూడా పార్టీలోకి రావాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. నామినేటెడ్ పదవులు ఇస్తాం, పార్టీలో కీలక పదవులు ఇస్తామని ఎర వేస్తున్న కూటమి నేతలు ఉన్న వారికి న్యాయం చేయలేకపోతున్నారనే ప్రచారం ఉంది. మొత్తం 120 వార్డులు ఉన్న అనకాపల్లి జీవీఎంసీలో భాగంగా ఈ రెండు వార్డుల ఎన్నికపై ఆసక్తి నెలకొని ఉంది.
జనసేన అభిమానిపై దాడి..!
అనకాపల్లి పట్టణంలోని గవరపాలెంలో జనసేన అభిమానిపై టీడీపీకి చెందిన కొందరు నేతలు దాడి చేసినట్టు తెలుస్తోంది. కార్పొరేట్ సీట్ల ఖరారు విషయంలో సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన జనసేన అభిమానితో టీడీపీ నేత బంధువులు మధ్య మొదలైన వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది.తాను కూడా స్థానికుడన్న భావనతో టీడీపీ నేతల బెదిరింపులకు దీటుగా జనసేన అభిమాని సమాధానం చెప్పడంతో టీడీపీ నేత బంధువులు దాడి చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు విషయమై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని జనసేన అభిమాని కోరినప్పటికీ రాజీ చేసుకోమని పోలీస్ సిబ్బంది సెలవివ్వడం గమనార్హం. అంతే కాకుండా ఏ జనసేన ప్రజా ప్రతినిధికి తాను సేవ చేశానో అతను కూడా ఇటువంటి కష్టకాలంలో అండగా నిలవలేదనే ఆవేదనతో జనసేన అభిమాని ఉన్నారు. ఒకవైపు వైఎస్సార్‌సీపీ నేతలకు బెదిరింపులు, జనసేన నేతపై దాడులు, అధికారుల ద్వారా కక్ష సాధింపు చర్యలు చేపట్టడంతో గవరపాలెం వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ స్థానికులపై రాజకీయ లబ్ధికోసం ఒత్తిడి తీసుకురావడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


