కంటతడి పెట్టుకున్న ఈరిగిల గంగరాజు, వరలక్ష్మి దంపతులు
అనకాపల్లి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి పార్టీల మధ్య సీట్ల పంచాయితీ చిచ్చు రేపుతోంది. పైకి ఐక్యత కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో టికెట్ల కేటాయింపులు అసమ్మతికి ఆజ్యం పోస్తున్నాయి. మాకవరపాలెంలో పొత్తులో తమకు ప్రాధాన్యం దక్కలేదన్న అసంతృప్తితో బీజేపీ నేరుగా బరిలోకి దిగగా, జనసేనలోనూ అభ్యర్థుల ఎంపికపై మరో వర్గం తిరుగుబాటుకు సిద్ధమవుతోంది. మరోవైపు యలమంచిలిలో నాలుగు దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన టీడీపీ నాయకులకే టికెట్ దక్కకపోవడంతో వారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి సై అంటున్నారు.
మాకవరపాలెంలో బీజేపీ తిరుగుబాటు
40 ఏళ్లుగా సేవ చేస్తే.. ఇంత మోసమా?
యలమంచిలి రూరల్: మున్సిపల్ ఎన్నికల వేళ యలమంచిలి కూటమిలో టికెట్ల కేటాయింపు వివాదాలు రచ్చకెక్కుతున్నాయి. 21వ వార్డులో టీడీపీ టికెట్ దక్కలేదంటూ ఆ పార్టీ నాయకుడు ఈరిగిల గంగరాజు, ఆయన భార్య వరలక్ష్మి అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం వరకు బీఫారం ఇస్తామని నమ్మించి చివరకు టికెట్ నిరాకరించారని ఆరోపిస్తూ దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. తమ కుటుంబం 40 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తోందని, పార్టీ నిర్వహించిన ఐవీఆర్‌ఎస్ సర్వేలోనూ తమకు 14వ ర్యాంకు వచ్చిందని వారు తెలిపారు. నామినేషన్లు వేసినప్పటికీ, ఇటీవల పార్టీలో చేరిన వారికి టికెట్ కేటాయించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తలకు గుర్తింపు దక్కడం లేదని విమర్శించారు. టీడీపీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు బీఫారాల పంపిణీ సందర్భంగా టీడీపీ, జనసేన కార్యాలయాల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు సమాచారం. టికెట్లు ఆశించి భంగపడిన కొందరు నామినేషన్లు ఉపసంహరించుకోకపోవడంతో కూటమి అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. టికెట్ల కేటాయింపుపై నెలకొన్న ఈ విభేదాలు ఎన్నికల వేళ రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి.
కె.అగ్రహారం ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేస్తున్న బీజేపీ అభ్యర్థి చక్రవర్తి,
కె.అగ్రహారం ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేస్తున్న కూటమి ఎంపీపీ అభ్యర్థి సత్యవరలక్ష్మి
మాకవరపాలెం: మండలంలోని 16 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, జి.కోడూరు మినహా మరెక్కడా బీజేపీకి సీట్లు కేటాయించలేదని ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించిన జి.గంగవరం మాజీ సర్పంచ్ సబ్బవరపు సత్యవరలక్ష్మి కొండల అగ్రహారం ఎంపీటీసీ స్థానానికి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇదే స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా గవిరెడ్డి రఘుచక్రవర్తి నామినేషన్ వేయడంతో కూటమిలో విభేదాలు బహిర్గతమయ్యాయి. మరోవైపు జీ.కోడూరు ఎంపీటీసీ స్థానానికి జనసేన మండల అధ్యక్షుడు సేనాపతి శేషు భార్య జ్యోత్స్నను అభ్యర్థిగా ఎంపిక చేయడంపై ఆ పార్టీలోని మరో వర్గం గుర్రుగా ఉంది. ఈ క్రమంలో చెవ్వాకులగంగతల్లి గురువారం జనసేన రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని జనసేన యూత్ అధ్యక్షుడు ఎస్.ఎస్.కుమార్ కూడా ధ్రువీకరించారు. మరోవైపు పార్టీ అధినాయకత్వం సూచన మేరకు జెడ్పీటీసీతోపాటు మరికొన్ని ఎంపీటీసీ స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులను బరిలోకి దించుతామని ఆ పార్టీ నేతలు రఘుచక్రవర్తి, బంగారు ఎర్రినాయుడు స్పష్టం చేశారు. దీంతో సీట్ల సర్దుబాటులో తలెత్తిన విభేదాలు కూటమి అభ్యర్థుల విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
21వ వార్డు నుంచి టీడీపీ రెబల్‌గా బరిలోకి..


