కూటమిలో ఐవీఆర్‌ఎస్‌ కలకలం! | - | Sakshi
Sakshi News home page

కూటమిలో ఐవీఆర్‌ఎస్‌ కలకలం!

Oct 22 2026 3:50 AM | Updated on Oct 22 2026 3:50 AM

సీటు ఖరారుకు సర్వేలే దిక్కు?

నామినేషన్ల తొలిరోజు

అభ్యర్థులకు తప్పనిఎదురుచూపులు

24 మండలాల్లో రెబల్స్‌ బెడద

ఖరారు కాని కూటమి జెడ్పీటీసీ స్థానాలు

సాక్షి, అనకాపల్లి: మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో రేగిన కూటమి కుంపట్లు పరిషత్‌ ఎన్నికలకూ పాకాయి. నిన్నటి వరకు జీవీఎంసీ, మున్సిపల్‌ ఎన్నికల్లో రెబల్స్‌ బెడదతో సతమతమైన కూటమి నేతలకు ఇప్పుడు జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది. అనకాపల్లి జిల్లాలోని 24 మండలాల్లో జెడ్పీటీసీ స్థానాలపై ఆశలు పెట్టుకున్న నేతలకు అభ్యర్థిత్వం ఖరారు కాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలై.. బుధవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనా కూటమి అభ్యర్థుల ఎంపికపై స్పష్టత లేకపోవడం ఆశావహులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఆశావహుల అసహనం

కూటమిలో ఏ స్థానాన్ని ఏ పార్టీకి కేటాయించారో తేలని పరిస్థితి ఒకవైపు ఉంటే.. మరోవైపు ఆయా మండలాల్లో జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక కోసం ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ రావడం ఆశావహుల్లో అసహనాన్ని పెంచుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేల విజయానికి పనిచేసిన తమకు సీటు కేటాయించే సమయంలో ఐవీఆర్‌ఎస్‌ సర్వేల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. స్థానికంగా నాయకుల మధ్య సర్దుబాటు చేసుకుని అభ్యర్థులను ఖరారు చేయలేరా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు మద్దతు ఇవ్వాలంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేయాల్సిన ఈ సమయంలో ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో తమకు సంబంధించిన నంబర్‌ నొక్కాలని కోరుతుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రెబల్స్‌పై చర్చ : జిల్లాలోని 24 మండలాల్లోనూ కూటమికి రెబల్స్‌ బెడద తప్పకపోవచ్చనే చర్చ సాగుతోంది. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఖరారు చేసుకుని, తొలిరోజే కొందరితో నామినేషన్లు వేయించగా.. కూటమిలో మాత్రం సీట్ల సర్దుబాటు, ఐవీఆర్‌ఎస్‌ సర్వేల పేరుతో ఆశావహులు నిరీక్షించాల్సి వచ్చింది. ముందు నామినేషన్‌ వేశాక బీఫారం కోసం ప్రయత్నించవచ్చునని భావించిన పలువురు ఆశావహులు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ప్రచారానికి సమయం తక్కువగా ఉన్న తరుణంలో అభ్యర్థిత్వాల ఖరారులో జాప్యం తమకు నష్టం కలిగిస్తుందని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement