రాంబిల్లి: దుర్గాదేవి విగ్రహ ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. బాణసంచా పేలడంతో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రాంబిల్లి మండలం కొత్తపట్నం గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామంలో దుర్గాదేవి ఊరేగింపు నిర్వహిస్తుండగా, ట్రాక్టర్‌పై బాణసంచా ఉంచి కాల్చారు. ఈ క్రమంలో మంటలు చెలరేగి ట్రాక్టర్‌పై ఉన్న బాణసంచా ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ట్రాక్టర్‌పై ఉన్నవారు భయంతో కిందకు దూకగా, ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో కొత్తపట్నానికి చెందిన చోడిపిల్లి రూప, చోడిపిల్లి శరణ్య, మెరిగి శ్రీజ, చింతకాయల శరత్, వాడనర్సాపురానికి చెందిన కొవిరి అప్పలరాజుతో పాటు మరో ఇద్దరు గాయపడినట్లు వీఆర్వో కుమార్ పట్నాయక్ తెలిపారు. వీరిలో రూప, అప్పలరాజులకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నానికి తరలించారు. మరో ముగ్గురు రాంబిల్లిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ, వీఆర్వో కుమార్ పట్నాయక్ పరామర్శించారు. బాణసంచా పేలుడు ఘటనతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బాణసంచా కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు.


