వ్యవసాయ కుటుంబం నుంచి.. అంతర్జాతీయ స్థాయికి.. | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ కుటుంబం నుంచి.. అంతర్జాతీయ స్థాయికి..

Oct 22 2026 3:50 AM | Updated on Oct 22 2026 3:50 AM

జపాన్‌లో మెరిసిన చిరికివానిపాలెం క్రీడాకారుడు రొంగలి రవి

ఆసియా పారా గేమ్స్‌లో సత్తా

షాట్‌పుట్‌ ఎఫ్‌–40 విభాగంలో కాంస్య పతకం కై వసం

కె.కోటపాడు: జపాన్‌లోని ఐచి–నగోయాలో జరుగుతున్న ఐదో ఆసియా పారా గేమ్స్‌లో అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం చిరికివానిపాలెం గ్రామానికి చెందిన పారా అథ్లెట్‌ రొంగలి రవి సత్తా చాటాడు. షాట్‌పుట్‌ ఎఫ్‌–40 విభాగంలో 10.02 మీటర్ల దూరం బంతిని విసిరి కాంస్య పతకాన్ని సాధించాడు. అంతర్జాతీయ వేదికపై భారతదేశం తరఫున పోటీపడి పతకం సాధించడంతో రవి స్వగ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రవి తల్లిదండ్రులు దేముడుబాబు, మంగలు చిరికివానిపాలెంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తమకున్న కొద్దిపాటి పొలంలో సాగు చేయడంతో పాటు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ కుమారుడి క్రీడా ప్రస్థానానికి ఆర్థికంగా అండగా నిలిచారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, పట్టుదలతో రవి అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ పతకాలు సాధిస్తున్నాడు.

గతంలోనూ పతకాల పంట : రవి గతంలోనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించాడు. 2017లో హర్యానాలో జరిగిన 18వ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో షాట్‌పుట్‌, జావెలిన్‌ త్రో విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించాడు. 2020లో బెంగళూరులో జరిగిన మూడో పారా అథ్లెటిక్స్‌ పోటీల్లో నూ ప్రతిభ కనబరిచాడు. 2021లో దుబాయ్‌లో జరిగిన 13వ ఫజా పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. 2022లో పోర్చుగల్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ పోటీల్లో రజత పతకాలు సాధించాడు. 2023లో చైనాలో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లోనూ రజత పతకం కై వసం చేసుకున్నాడు. 2024లో పారిస్‌లో జరిగిన పారా ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement