ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దు

Oct 22 2026 3:50 AM | Updated on Oct 22 2026 3:50 AM

● శిక్షణ కార్యక్రమంలో జేసీ ఆదేశం

తుమ్మపాల: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జేసీ శౌర్యమాన్‌ పటేల్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, జిల్లా స్థాయి అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకూడదని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక, గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గతంలో జరిగిన ఘటనలు, నమోదైన కేసుల వివరాలను ఎంపీడీవోలు, పోలీసు అధికారులు, తహసీల్దార్ల నుంచి సేకరించి ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. మార్గ, మండల పటాల ఆధారంగా సున్నిత ప్రాంతాలను గుర్తించి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కాలనీల ఓటర్లను ఎవరైనా బెదిరించినా, భయభ్రాంతులకు గురిచేసినా, ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, బెదిరించడం తీవ్రమైన నేరమని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకురాలు పూర్ణిమ దేవి పేర్కొన్నారు. పోలింగ్‌ కేంద్రాలను సమస్యల తీవ్రత ఆధారంగా వర్గీకరించి, ఆ వివరాలను నిర్దేశిత ప్రొఫార్మా–1 ద్వారా ముందుగానే సమర్పించాలని సూచించారు. ఎస్‌ఈసీఎంఎస్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని, ఓటర్లు తమ హక్కును వినియోగించుకోని ప్రాంతాలపై ప్రత్యేక నివేదిక సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement