నర్సీపట్నం: నామినేషన్ల స్వీకరణ అధికారి తలుపులు ముందు తమ అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించి టీడీపీ నాయకుల ఒత్తిడితో కొద్ది నిమిషాల్లో తిరస్కరించడం దారుణమని వైఎస్సార్‌సీపీ లీగల్ విభాగం ప్రతినిధి మాకిరెడ్డి బుల్లిదొర, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ ఆగ్రహించారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ చిన్న చిన్న లోపాలను సాకుగా చూపి తమ పార్టీకి సంబంధించిన ఇద్దరు కౌన్సిలర్లు నామినేషన్లు తిరస్కరించడం దారుణమన్నారు. తమ పార్టీ లీగల్ సెల్ ద్వారా ఎన్నికల అధికారులపై కోర్టును ఆశ్రయిస్తున్నామన్నారు. అభ్యర్థుల నామినేషన్లు మున్సిపల్ కార్యాలయం నుంచి బయటకు ఎలా వెళ్లాయని ప్రశ్నించారు. టీడీపీ మాజీ కౌన్సిలర్ భర్త ప్రస్తుత ఎంఈవో, మాకవరపాలెం టీడీపీ కీలకనేత బంధువు ఎన్నికల అధికారులుగా నియమించుకోని ఈ దురాఘాతాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తమ సెల్‌ఫోన్లు బయట తీసుకుని, కూటమి నాయకులవి పోలీసులు అనుమతించడం దారుణమన్నారు. ఎన్నికల అధికారులు, పోలీసులు, మున్సిపల్ అధికారులు చాలా దారుణంగా వ్యహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. 25 ఏళ్లుగా ఓటమి చెందిన స్థానాల అభ్యర్థులపై దృష్టి సారించి పోటీలో లేకుండా చేశారని ధ్వజమెత్తారు. అధికారులపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ప్రశాంతమైన జీవితం గడపాలంటే తప్పని సరిగా వైఎస్సార్‌సీపీని ఆదరించాలని కోరారు. సమావేశంలో పార్టీ పట్టణాధ్యక్షుడు ఏకా శివ, పార్టీ రాష్ట్ర నాయకులు చింతకాయల వరుణ్, పెదిరెడ్ల చిన్ని తదితరులు పాల్గొన్నారు.


