● కలెక్టర్‌ విజయకృష్ణన్‌ | - | Sakshi
Sakshi News home page

● కలెక్టర్‌ విజయకృష్ణన్‌

Sep 29 2026 1:27 AM | Updated on Sep 29 2026 1:27 AM

● కలెక్టర్‌ విజయకృష్ణన్‌

అర్జీల పరిష్కారంలో

నిర్లక్ష్యం వద్దు

తుమ్మపాల: పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమాల్లో ఆమెతో పాటు జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 265 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన అర్జీలను సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి గడువులోగా పరిష్కరించాలన్నారు. అర్జీదారులతో అధికారులు నేరుగా మాట్లాడి సమస్య స్వరూపాన్ని తెలుసుకోవాలని సూచించారు. పరిష్కారం సాధ్యం కాని అర్జీల విషయంలో కారణాలను అర్జీదారులకు స్పష్టంగా వివరించాలని సూచించారు. తద్వారా అర్జీలు తిరిగి నమోదయ్యే పరిస్థితిని నివారించవచ్చన్నారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన అర్జీదారుల కోసం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్‌ అధికారి వి.సుధీర్‌, జిల్లా సర్వే, భూ రికార్డుల సహాయ సంచాలకులు గోపాల్‌రాజ, జిల్లా వ్యవసాయ అధికారి ఆశాదేవి, ఐసీడీఎస్‌ పీడీ సూర్యలక్ష్మి పాల్గొన్నారు.

ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా...

వ్యయప్రయాసలకోర్చి వచ్చి పీజీఆర్‌ఎస్‌లో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని, సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు అసహనం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌ గేటు వద్ద కొందరు నిరసన వ్యక్తం చేశారు.

ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని నిలిపివేయాలి

అనకాపల్లి పట్టణంలోని లక్ష్మీదేవిపేట రైల్వేగేటు నుంచి భీమునిగుమ్మం వీధి వరకు చేపట్టనున్న ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని నిలిపివేయాలని అంబేడ్కర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భీమునిగుమ్మం వీధిలో సుమారు 250 దళిత కుటుంబాలు నివసిస్తున్నాయని, ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపడితే అక్కడ ఉన్న డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ మున్సిపల్‌ పాఠశాల విద్యార్థులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇళ్ల వద్ద రహదారి వెడల్పు తగ్గడంతో వాహనాలు, పాదచారుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. అంబేడ్కర్‌ విగ్రహం, రైల్వే స్టేషన్‌ పరిసరాలు కూడా కనిపించకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. జిల్లా అధికారులు ప్రతిపాదిత ఫ్లైఓవర్‌ ప్రాంతాన్ని, రైల్వే స్టేషన్‌ వద్ద మోడల్‌ రైలు ఏర్పాటుకు చేపట్టిన పనుల ప్రాంతాన్ని పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన నిర్ణయం తీసుకోవాలని అంబేడ్కర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ప్రతినిధులు కోరారు. అంతకు ముందు కలెక్టర్‌కు ఈ సమస్యలపై అర్జీ అందజేశారు.

ఎస్సీ బాధితులకు సత్వర పరిష్కారం కల్పించాలి

షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన వ్యక్తుల కేసుల్లో సత్వరమే పరిష్కారం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ బహుజన సమాజ్‌వాది పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లవరపు లోవచందు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో చట్టం, నిబంధనలకు అనుగుణంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

స్థానిక పోలీసులపైనే ఆరోపణలు ఉన్న సందర్భాల్లో అదే యంత్రాంగంతో దర్యాప్తు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని తెలిపారు. అటువంటి కేసులను స్వతంత్ర దర్యాప్తు సంస్థ లేదా ఉన్నతస్థాయి దర్యాప్తు బృందానికి అప్పగించాలని కోరారు. అనంతరం కలెక్టర్‌కు అర్జీ అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement