రాంబిల్లి : దిమిలి గ్రామానికి చెందిన యువతి తాడి పూర్ణ(19) అదృశ్యమైనట్టు సోమవారం రాత్రి తల్లి శారద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటి నుంచి తన కుమార్తె వెళ్లిపోయిందని ఆయా ఫిర్యాదులో పేర్కొన్నట్టు సీఐ నర్సింగరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ తెలిపారు. కాగా ఆదివారం పూర్ణ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆమె కోసం వెతుకుతుండగా దిమిలి గ్రామ శారద నది ఒడ్డున పూర్ణ చెప్పులు కనిపించడంతో ఆందోళన చెంది, సోమవారం పోలీసులను ఆశ్రయించారు.
తల్లిదండ్రులు తనకు ఇష్టం లేని పెళ్లి నిశ్చయించడమే ఆమె అదృశ్యానికి కారణంగా భావిస్తున్నారు. ఇంటర్ పూర్తి చేసిన పూర్ణ డిగ్రీ చదివేందుకు ఆసక్తి చూపుతోంది. ఏమైనా తమ కుమార్తె సురక్షితంగా ఇల్లు చేరుతుందని తల్లిదండ్రులు కొండంత ఆశగా ఎదురు చూస్తున్నారు.


