తాను చేయని తప్పును ఒప్పుకోవాలని రాజకీయ ఒత్తిడితో బెదిరించి రూ.10 వేలను ఫోన్‌పే ద్వారా బలవంతంగా చెల్లించేలా చేశారని ఆరోపిస్తూ ఓ ఆటో ఫైనాన్స్ సంస్థ ఉద్యోగి ఆళ్ల దుర్గాప్రసాద్ కశింకోట పోలీసులపై పీజీఆర్‌ఎస్‌లో ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. కశింకోటకు చెందిన ఓ వ్యక్తి సంస్థ ద్వారా రుణంపై ఆటో తీసుకుని రెండు నెలలుగా వాయిదాలు చెల్లించకపోవడంతో ఈ నెల 20న ఆటోను సీజ్ చేసి కంపెనీ యార్డుకు తీసుకెళ్లినట్టు తెలిపాడు. బకాయిలు చెల్లించి ఆటోను తీసుకెళ్లిపోయిన వ్యక్తి ఫిర్యాదు మేరకు ఈ నెల 21న కశింకోట పోలీసులు తనకు ఫోన్ చేసి స్టేషన్‌కు రావాలని ఆదేశించారని, స్టేషన్‌కు వెళ్లిన అనంతరం తన సెల్‌ఫోన్, ఐడీ కార్డును తీసుకున్నారని, తనపై ఫిర్యాదు ఉందంటూ ఒక గదిలో ఉంచి తాను రూ.30 వేలు అప్పు తీసుకున్నట్టు పేపర్‌పై రాయించి, బెదిరించి సంతకం చేయించారని తెలిపాడు. అదే సమయంలో ఫిర్యాదు చేసిన వ్యక్తికి రూ.10 వేలు ఫోన్ పే చేయాలని ఒత్తిడి చేయడంతో భయపడి ఆ మొత్తాన్ని చెల్లించినట్లు తెలిపాడు. మిగిలిన రూ.20 వేలను రెండు నెలల్లో చెల్లించాలని బెదిరించారని ఆరోపించాడు. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపి, తనకు న్యాయం చేయడంతో పాటు బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు.


