దొంగనోట్ల మార్పిడిలో రూ.10 లక్షలతో పరారైన ముఠా
నష్టంలో వాటాగా రూ.2.5 లక్షలు ఇవ్వాలని నిందితుల డిమాండ్
ఇవ్వకపోవడంతో వర ప్రకాష్‌రావు దారుణ హత్య
యలమంచిలి రూరల్: రెండ్రోజులు నిర్బంధం.. ఆపై చిత్రహింస.. దారుణంగా హత్య చేసి గోదావరిలో మృతదేహం పడేసి పరారీ.. ఇదీ యలమంచిలి పట్టణం పాత స్టేట్ బ్యాంక్ కాలనీకి చెందిన వ్యాపారి కర్రి వర ప్రకాష్‌రావు(49) హత్య కేసులో బయటపడిన సంచలన విషయాలు. కేసుకు సంబంధించి పరవాడ డీఎస్పీ బి మోహన్‌రావు సోమవారం యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్‌లో మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 16వ తేదీన కార్ల వ్యాపారి కర్రి వరప్రకాష్ అదృశ్యం కేసులో మొబైల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి వరప్రకాష్‌రావు హత్యకు గురైనట్టు,అతని మృతదేహాన్ని నిందితులు గోదావరిలో పడేసినట్టు గుర్తించారు. గాజువాకకు చెందిన చీమకుర్తి జగదీష్, తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరానికి చెందిన కూడుపూడి రామాంజనేయులు(పండు), కోనసీమ జిల్లా అమలాపురం గారపాటివారి వీధికి చెందిన వ్యాపారి కేదార్‌శెట్టి విజయ్ గణేష్‌లతోపాటు యలమంచిలికి చెందిన కర్రి వరప్రకాష్‌రావుకు మాత్రమే తెలిసిన రమేష్ కరెన్సీ మార్పిడి లావాదేవీల నిమిత్తం ఈ నెల 16న రాజమహేంద్రవరంలో ఓ చోట కలుసుకున్నారు. రూ.10 లక్షల అసలు కరెన్సీ నోట్లకు రూ.40 లక్షల నకిలీ నోట్లు ఇవ్వడానికి కుదిరిన ఒప్పందంలో భాగంగా రమేష్ మరొక వ్యక్తితో కలిసి విజయ్ గణేష్‌ను ఏమార్చి రూ.10 లక్షల అసలు కరెన్సీతో పరారయ్యారు.
రూ.2.5 లక్షలిచ్చి బయటపడిన జగదీష్
తమను మోసం చేశారని తెలుసుకున్న విజయ్ గణేష్, రామాంజనేయులు కలిసి జగదీష్, వర ప్రకాష్‌లను కారులో అమలాపురం తీసుకెళ్లారు. రూ.10 లక్షల నష్టాన్ని నలుగురు సమానంగా రూ.2.5 లక్షలు చొప్పున ఇచ్చుకోవాలని అంగీకారానికి వచ్చారు. జగదీష్ తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుకుని రూ.2.5 లక్షలు చెల్లించడంతో అతడిని నిందితులు వదిలిపెట్టారు. వరప్రకాష్‌ను కూడా రూ.2.5 లక్షలు చెల్లించాలని ఎంత ఒత్తిడి చేసినా స్పందన లేకపోవడంతో నిందితులు అతడిని హత్య చేశారు. ఇందుకు మరో ఇద్దరు సహకరించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుల్లో ఒకరైన విజయ్ గణేష్‌ను సోమవారం అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. మరో నిందితుడు రామాంజనేయులు పరారీలో ఉండగా, మిగిలిన నిందితులను గుర్తించాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. కేసును కోనసీమ జిల్లా అల్లవరం పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయనున్నట్టు తెలిపారు.


