పచ్చనేత మోసం... దళితులకు ద్రోహం | - | Sakshi
Sakshi News home page

పచ్చనేత మోసం... దళితులకు ద్రోహం

Sep 24 2026 2:06 AM | Updated on Sep 24 2026 2:06 AM

ఓ పచ్చనేత మోసం.. దళితులకు శాపమైంది. యాభై ఏళ్ల క్రితం దళితులకు ఇచ్చిన భూముల్ని నాటకీయ పరిణామాల మధ్య జప్తు చేస్తూ రెవెన్యూ అధికారి ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 8 నెలల నుంచి తమ భూముల హక్కుల కోసం పోరాటం చేస్తున్న 16 దళిత కుటుంబాల వైపు కన్నెత్తి చూడకుండా జిల్లా అధికారులు, కూటమి నేతలు వ్యవహరించడం శోచనీయం.

● పంచదార్ల 8 నెలల పోరాటానికి దొరకని పరిష్కారం

● యాభై ఏళ్ల క్రితం

16 దళిత కుటుంబాలకు ఇచ్చిన 43 ఎకరాలు జప్తు

● పట్టించుకోని జనసేన ఎమ్మెల్యే, ప్రశ్నించని అధినేత

సాక్షి, అనకాపల్లి : రాంబిల్లి మండలంలోని పంచదార్ల పరిధిలో ఉన్న 16 దళిత కుటుంబాలకు 1978లో అప్పటి ప్రభుత్వం ఢీ పట్టాలిచ్చింది. ఒక్కొక్కరికి 2.77 ఎకరాల చొప్పున ఈ భూముల్ని దళితులకు ఇచ్చారు. అత్యంత విశాలమైన చోడపల్లి–కొత్తూరు కొండకు ఆనుకొని పంచదార్ల సర్వే నంబర్‌ 2/1లో ఉన్న ఈ భూముల విస్తీర్ణం 43 ఎకరాల వరకూ ఉంటుంది. అప్పట్లో ఈ భూముల విలువ పెద్దగా లేనందున ఎవ్వరూ పట్టించుకోలేదు. దళిత కుటుంబాలకు చెందిన రైతులు జీడి, మామిడి, అకీస్‌ వంటి పంటల్ని సాగు చేసుకుంటూ వారి కుటుంబాల్ని నెట్టుకొచ్చారు. కాలక్రమేణా అచ్యుతాపురం, రాంబిల్లి పరిసరాల్లో నెలకొల్పిన పరిశ్రమలతో గ్రావెల్‌తో కూడిన ఈ ప్రాంత భూములకు డిమాండ్‌ పెరిగింది.

భూముల్ని చదును చేయిస్తానని చెప్పి

గ్రావెల్‌ దోపిడీ...

ఈ ప్రాంతానికి టీడీపీ నేత దళితులకు ఇచ్చిన డీ పట్టా భూముల్ని చదును చేయిస్తానని చెప్పడంతో పాటు కొందరు దళితులకు కొంత నగదు ముట్టజెప్పి భారీ స్థాయిలో గ్రావెల్‌ దోపిడీ జరిపారు. అదే ఇక్కడి దళితులకు శాపంగా మారింది. పెద్దగా అక్షరజ్ఞానం లేని ఇక్కడి దళిత రైతులకు ఆ పచ్చనేత గ్రావెల్‌ అమ్ముకున్నట్టు తెలియదు. జిల్లా ఉన్నతాధికారుల నివేదికలో గ్రావెల్‌ తవ్వకాలు జరిపారని ఒక అభియోగాన్ని చూపి వారి డీ పట్టాల జప్తు చేయడం..ఇందులో ఒక నాటకీయ పరిణామం.

హుద్‌హుద్‌ పరిహారం కూడా వచ్చింది...

ఈ ప్రాంత రైతులు సాగు చేసుకున్న జీడి, మామిడి పంటలకు 2014లో వచ్చిన హుద్‌హుద్‌ తుపాను కారణంగా నష్టం కలిగిందని, ఒక్కో రైతుకు 24 వేల రూపాయల చొప్పున పరిహారం కూడా అందజేశారు. దీనికి బట్టి రైతులు సాగులో ఉన్నట్టేనన్నది స్పష్టమవుతోంది.

ఆందోళన బాటలోకి...

ఈ ఏడాది సంక్రాంతి సమయంలో జరిగిన ఈ తతంగంతో మోసపోయిన దళితులు తమకు న్యాయం చేయమని అధికారులకు వినతి పత్రాలు సమర్పించ్చారు. ఫిబ్రవరి నుంచి ఆయా స్థలాల్లో దీక్షా శిబిరాలు నిర్వహించారు. ఇప్పటికి సుమారు 8 నెలలు కావస్తోంది. ఈ క్రమంలోనే ప్రజా సంఘాల నేతలు, వైఎస్సార్‌సీపీ నేతలు బాధితుల దీక్షలకు సంఘీభావం పలికారు. మరోవైపు కోర్టుని సైతం ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ అంశం ఆర్డీవో కోర్టు పరిఽధిలో ఉన్నట్టు సమాచారం. ఇంత జరుగుతున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే గానీ, ఆయన అధినేత పవన్‌ కళ్యాణ్‌ గానీ దళిత రైతులకు మద్దతు ప్రకటించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పోరాటం ఆపేది లేదు...

మా భూముల్ని దక్కించుకునేందుకు చేసే పోరాటం ఆపం. మా ప్రాంతానికి చెందిన టీడీపీ నేత మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. కూటమి ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. ఒక్క పైసా ఇవ్వకుండా భూముల్ని ఎలా తీసుకుంటారు. ప్రభుత్వానికి భూములు అవసరమైతే చట్టపరంగా మా సమ్మతితో పరిహారం ఇచ్చి స్వాధీనం చేసుకోండి.

–రాజు, బాధిత దళిత కుటుంబాల ప్రతినిధి

స్కెచ్‌ మొదలైంది ఇక్కడే...?

అచ్యుతాపురం, రాంబిల్లి సెజ్‌ నిర్వాసితుల్లో కొందరికి ఇంకా ఇళ్ల స్థలాలు అందజేయలేదు. దీంతో దళితుల భూములపై కూటమి ప్రజాప్రతినిధి కన్నుపడింది. రెవెన్యూ అధికారి, స్థానిక టీడీపీ నేతలు హైడ్రామా మొదలుపెట్టారు. స్థానికంగా అన్ని వ్యవహరాలు చక్కదిద్దే కూటమి ప్రజా ప్రతినిధి సేవలో ఉన్న టీడీపీ నేత దళిత రైతులకు చెందిన కొందరు ప్రతినిధులను పిలిపించి మీకు ఎకరానికి రూ.25 నుంచి 30 లక్షలకు పైగా పరిహారం ఇప్పిస్తానని నమ్మబలికారు. ఈ క్రమంలో మీకు వచ్చే నోటీసులను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని సూచించారు. ఇది తెలియని దళితులు రెండు విడతల్లో వచ్చిన నోటీసుల్ని పట్టించుకోలేదు. మూడోసారి వచ్చిన నోటీసుల్ని కూడా తీసుకోకపోతే ఆటోమేటిక్‌గా రైతులు అక్కడ సాగులో లేరనే సాకు చూపి డీ పట్టాల్ని రద్దు చేయడమే అసలు పన్నాగం. దళితుల్లో కొందరికి అనుమానం వచ్చి మూడోసారి వచ్చిన నోటీసులను తీసుకొని చదవడంతో అసలు బండారం బయటపడింది. ఆ నోటీసుల్లో ఉన్న సారాంశం మేరకు రైతులు 18 సంవత్సరాలుగా ఊర్లో లేరని, మూడు సంవత్సరాలుగా సాగులో లేరని ఉంది. దీంతో అది చూసిన దళిత రైతులు అవాక్కయ్యి స్థానిక టీడీపీ నేతను నిలదీశారు. అప్పటి వరకూ నమ్మబలికిన టీడీపీ నేత దళితులకు ఎదురు తిరగడంతో డీ పట్టాల హక్కు రైతుల చేయి దాటిపోయినట్టయ్యింది. ఈ నోటీసులకు తోడు గతంలో ఒక టీడీపీ నేత భూముల్ని చదును చేయిస్తానని చేపట్టిన గ్రావెల్‌ తవ్వకాలను బేరీజు వేసుకొని డీ పట్టాల్ని జప్తు చేసినట్టు వెలుగులోకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement