తగ్గేదేలే | - | Sakshi
Sakshi News home page

తగ్గేదేలే

Sep 27 2026 1:10 AM | Updated on Sep 27 2026 1:10 AM

● సచివాలయ ఉద్యోగుల బిగ్‌ఫైట్‌!

● నేడు ‘చలో విజయవాడ’కు పిలుపు

సాక్షి, విశాఖపట్నం: తమ హక్కులు, భవిష్యత్తు కోసం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మరోసారి ఉద్యమానికి సిద్ధమయ్యారు. రెండేళ్లుగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా పరిష్కారం లభించలేదని పేర్కొంటూ ఈ నెల 27న ‘చలో విజయవాడ’కు సచివాలయ ఉద్యోగుల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. తీవ్ర వాయుగుండం నెపంతో ప్రభుత్వం అత్యవసర విధుల పేరుతో సర్క్యులర్‌ జారీ చేసి, ఉద్యోగులు జిల్లా కేంద్రాలు దాటకూడదని ఆంక్షలు విధించింది. సోషల్‌ మీడియాలో నిరసనలు నడిపిస్తున్నారనే కారణంతో శ్రీకాకుళం జిల్లా విలేజ్‌ సర్వేయర్ల రాష్ట్ర అధ్యక్షుడు బూరాడ మధుబాబును సస్పెండ్‌ చేసింది. ఈ చర్యలపై ఉద్యోగ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ‘వర్షాలు వస్తే మిగతా ఉద్యోగులకు లేని అత్యవసర నిబంధనలు మాకే ఎందుకు? బెదిరింపులకు భయపడేది లేదు, విజయవాడకు తరలివెళ్లి తీరతాం’ అని స్పష్టం చేశాయి. సచివాలయ ఉద్యోగులు ఈ నెల 6న విశాఖలో శాంతియుత నిరసనలు, రాస్తారోకో చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచి తగిన స్పందన వచ్చేంతవరకు ఐక్యతతో పోరాటం కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక స్పష్టం చేసింది.

ముఖ్య డిమాండ్లు

● ఆర్థిక ప్రయోజనాలు: రెండు నోషనల్‌ ఇంక్రిమెంట్లు, ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ తక్షణమే వర్తింపజేయాలి.

● వేతనం – పదోన్నతులు: స్పష్టమైన ప్రమోషన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి, కనీస బేసిక్‌ పే రూ.30,000గా నిర్ణయించాలి.

● జీవో–11 రద్దు: ఉద్యోగులకు ప్రతిబంధకంగా మారిన జీవో నెం. 11ను తక్షణమే రద్దు చేయాలి.

● బకాయిలు: ప్రమోషన్‌ ఆలస్యమైన 9 నెలల కాలానికి సంబంధించిన బకాయిలు, అదనపు ఇంక్రిమెంట్‌ మంజూరు చేయాలి.

● కారుణ్య నియామకాలు: మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 3 నెలల్లో హక్కులు కల్పించి, కారుణ్య నియామకం చేపట్టాలి.

● ప్రాతినిధ్యం: జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో స్వర్ణ గ్రామ/వార్డు ఉద్యోగ సంఘాలకు భాగస్వామ్యం కల్పించాలి.

అనుమతి లేదు : ఎస్పీ తుహిన్‌ సిన్హా

అనకాపల్లి : జిల్లాలో పనిచేస్తున్న స్వర్ణగ్రామ..స్వర్ణ వార్డు ఉద్యోగస్తులు ఈనెల 27న తమ డిమాండ్ల సాధన కోసం నిర్వహించనున్న చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనడానికి అనుమతి లేదని ఎస్పీ తుహిన్‌ సిన్హా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజల భద్రత, సహాయక, పునరావాస కార్యక్రమాలు, అత్యవసర సేవలను సమర్ధంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగానికి ప్రభత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరై కార్యకమానికి హాజరయే వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టి, కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లాలో ప్రతి బస్టాండ్‌ , రైల్వే స్టేషన్లో పోలీస్‌ సిబ్బందిని నియమించి చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లే వారిని గుర్తించి చర్యలు చేపడతామన్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లా సచివాలయాల సమాచారం

మొత్తం సచివాలయాలు: 1,341 – మొత్తం ఉద్యోగులు: 10,078

విశాఖ జిల్లా: 607 సచివాలయాలు (4,860 మంది ఉద్యోగులు)

అనకాపల్లి జిల్లా: 522 సచివాలయాలు (3,824 మంది ఉద్యోగులు)

అల్లూరి జిల్లా: 212 సచివాలయాలు (1,394 మంది ఉద్యోగులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement