సుదూర సముద్ర తీరం.. ఆహ్లాదం గొలిపే మంచినీటి సరస్సు..సరస్సులో వలస పక్షుల కిలకిలారావాలు.. చారిత్రక విశిష్టత కలిగిన బొజ్జన్న, లింగాల కొండలు..ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాల సమాహారంఅనకాపల్లి జిల్లా. పర్యాటకుల మనసు దోచే ఈ ప్రాంతాలకు అదనపు హంగుల్ని చేర్చితే మరింత శోభనిస్తుంది. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యంగా కారణంగా జిల్లాలో పర్యాటక రంగంలో నిస్తేజం, నైరాశ్యం కనిపిస్తోంది.
తూతూ మంత్రం..
● జిల్లాలో సుందర బీచ్‌ల అభివృద్ధికి కదలికేది ? ● కలగానే పర్యాటక హంగుల కల్పన
● కొండకర్ల ఆవపైనా ప్రభుత్వం శీతకన్ను ● నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం
తంతడి బీచ్ వద్ద రెండు కొండల నడుమ సుందర సముద్ర తీరం
కొండకర్ల ఆవలో బోటులో విహరిస్తున్న పర్యాటకులు(ఫైల్)
సాక్షి, అనకాపల్లి : జిల్లాలో పర్యాటకుల మనసు దోచుకునే సందర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి. అనకాపల్లి మండలంలోని బొజ్జన్న, లింగాల కొండలు వేలాది సంవత్సరాల చారిత్రక, సాంస్కృతిక విశిష్టతకు చిరునామాలు. వీటిని పురావస్తు రక్షిత స్థలంగా నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో రూ.9 కోట్ల పైబడి నిధులు వెచ్చించి బొజ్జన్నకొండ వద్ద పలు అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిని పూర్తి చేసి పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రస్తుత ప్రభుత్వం నిర్లిప్తత కనబరుస్తోంది.
కొండకర్ల ఆవ.. అభివృద్ధికి ఆవలే..
జిల్లా ప్రధాన కేంద్రమైన అనకాపల్లికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో సుమారు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వాడ్రాపల్లి–కొండకర్ల ఆవ జిల్లాలో మరో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉంది. రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద మంచినీటి సరస్సు ఇది. ఎన్నో రకాల కొంగలు, వలస పక్షులకు నిలయం. పచ్చని ప్రకృతి నడుమ ఆహ్లాదం గొలిపే ఆవ అందాలు బోటు షికారుకు పర్యాటకులను రార మ్మని ఆహ్వానిస్తుంటాయి. అంతేకాకుండా నేచర్ ఫొటోగ్రఫీ, బర్డ్ వాచింగ్ కోసం పర్యాటకులు తరలివస్తుంటారు. ముఖ్యంగా ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి నడుమ శీతాకాలంలో ఇక్కడకు సుదూర తీరాల నుంచి వచ్చే వలస పక్షులు చూపరులకు కనువిందు చేస్తాయి. ఆవలో ప్రభాత వేళలో విచ్చుకునే కమలాల నడుమ బోటు ప్రయాణం చక్కని అనుభూతిని ఇస్తుంది. ఎకో టూరిజం అభివృద్ధికి ఎంతో అవకాశం ఉన్న ఆవ విషయంలోనూ చిత్తశుద్ధి కనిపించడం లేదు. ఇక్కడికి సమీపంలో బ్రిటిష్ కాలం నాటి గెస్ట్‌హౌస్ అభివృద్ధిని సైతం గాలికొదిలేశారు.
బీచ్‌ల అభివృద్ధికి ప్రణాళికలు ఏవీ..?
జిల్లాలో సుమారు 50 నుంచి 60 కిలోమీటర్ల మేర సముద్రతీర ప్రాంతం ఉంది. ఇక్కడ 35 బీచ్‌లను అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించారు. కనీసం రెండు ఎకరాల ప్రభుత్వ స్థలం ఉండి, రవాణా సౌకర్యం మెరుగుపరచడం ద్వారా టూరిజం స్పాట్‌లు ఏర్పాటు చేయాలని అప్పట్లో పర్యాటక శాఖ నిర్ణయించింది. కానీ ప్రభుత్వం మారగానే ప్రతిపాదనలు అటకెక్కాయి.
తంతడి తీరం షూటింగ్‌లకు అనుకూలం
ముత్యాలమ్మపాలెం, తంతడి, పూడిమడక, సీతపాలెం వంటి సుందర తీర ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఇక్కడ బీచ్‌లను అభివృద్ధి చేసి సౌకర్యాలు కల్పిస్తే పర్యాటకులు పోటెత్తే అవకాశం ఉంది. స్థానికులకు ఉపాధి కూడా లభిస్తుంది. ముఖ్యంగా తంతడి తీరంలో నిర్వహించే సినిమా షూటింగ్‌ల నిర్వాహకులకు ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో రాత్రి బస కోసం విశాఖకు వెళ్లి రావాల్సి వస్తోంది. దీనిని కూడా పరిగణనలోకి తీసుకొని తీర ప్రాంతాల్లో గెస్ట్‌హౌస్‌లు నిర్మించాలని నిర్ణయించారు. విశాఖపట్నం తీరంలో వెలసిన గెస్ట్ హౌస్‌లు, హోటళ్లు రిసార్ట్‌లు అక్కడ పర్యాటకం పెరగడానికి చాలా దోహద పడుతున్నాయి. అదే తరహా నిర్మాణాలు అనకాపల్లిలో చేపట్టాలని నిర్ణయించినప్పటికీ అడుగు ముందుకు పడడం లేదు.
ఫుడ్‌కోర్టులు, కాటేజ్‌లు..ప్రతిపాదనలతో సరి
తీరంలో 35 బీచ్‌ల్లో అందుబాటులో ఉన్న స్థలాలపై పర్యాటక శాఖకు ఒక అంచనా ఉంది. ఆ మేరకు స్థల సమస్య తీరిన వెంటనే పర్యాటకులకు అవసరమైన ఫుడ్ కోర్టులు, రెస్ట్ రూమ్‌లు నిర్మించే పనికి ఉపక్రమించాలని భావించినా అమలు కాలే దు. రేవు పోలవరంలో ప్రధానంగా బీచ్ అభివృద్ధికి 8 ఎకరాలు సేకరించారు.ఇక్కడ ఉన్న విశాలమైన తీర ప్రాంతాన్ని, జెట్టీని, అడ్డురోడ్డు నుంచి రవాణా మార్గాన్ని గుర్తించారు.అవసరమైన వసతులకు సంబంధించి టెండర్లు పిలిచినట్టు పర్యాటక శాఖ అధికారులు చెప్పినా అది అమలులో ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు.
ఆధ్యాత్మిక కేంద్రానికిమైనింగ్ ముప్పు
నిధులు.. సిబ్బంది కొరత
అనకాపల్లి పర్యాటక శాఖకు నేను ఇన్‌ఛార్చి అధికారిని మాత్రమే. ఇక్కడ ప్రస్తుతానికి అవసరమైన సిబ్బంది లేరు. పెందుర్తి ఎమ్మెల్యే సిఫారసు మేరకు ముత్యాలమ్మపాలెంలో పర్యాటక హంగులు కల్పించేందుకు అవసరమైన డీపీఆర్‌ను సైతం విశాఖ అధికారులు చేపట్టాలి. మిగిలిన ప్రతిపాదనలంటూ ఏమీ లేవు. – మనోరమ,
అనకాపల్లి పర్యాటక శాఖ ఇన్‌ఛార్జి అధికారి.
జిల్లాలో బలిఘట్టం, పంచదార్ల వంటి విశిష్ట ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాల్సిన పంచదార్ల ఆలయం వద్ద ఇటీవల పాలకులు చేపట్టిన గ్రావెల్ విధ్వంసంతో పుణ్య జలాల పవిత్రత దెబ్బతిన్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో అనకాపల్లిలో కోస్టల్ మేనేజ్‌మెంట్‌కు అనుబంధంగా పర్యాటక శాఖ అడుగులు వేసేందుకు ప్రయత్నించగా ఇప్పటి ప్రభుత్వం బ్రేకులు వేసింది.


