చోడవరం : ఒక పక్క చెరకు రైతుల బకాయిల కోసం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మహాజనసభ నిర్వహించేందుకు సిద్ధమౌతున్న సమయంలో ఎట్టకేలకు బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో గోవాడ చెరకు రైతులకు చెల్లించాల్సిన రూ.28.43 కోట్లు బకాయిలు చెల్లించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ 2023–24 క్రషింగ్ సీజన్‌కు సంబంధించి చెరకు సరఫరా చేసిన రైతులకు రూ.28.43 కోట్లు ఫ్యాక్టరీ చెల్లించాల్సి ఉంది. ఆర్థిక పరిస్థితి బాగోలేక అప్పుల్లో కూరుకుపోయిన ఫ్యాక్టరీ ఆ మొత్తాన్ని రైతులకు చెల్లించలేక 40 శాతానికి మించి వాటా ఉన్న ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం కోరింది. అయితే కూటమి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల బకాయిలు చెల్లించేందుకు అవసరమైన డబ్బులు సమకూర్చేందుకు ఆసక్తి చూపలేదు. అంతకుముందు ఐదేళ్ల పాటు అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏటా రూ.15 కోట్లు నుంచి 20 కోట్లు వరకూ సాయం చేసి ఐదేళ్లలో రూ.90కోట్లు మేర రైతుల చెరకు పేమెంట్స్, ఫ్యాక్టరీకి నిర్వహణకు ఆర్థిక సాయం అందించింది. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక 2023–24లో సీజన్‌కు సంబంధించి రైతులకు చెరకు బకాయిలు చెల్లించడానికి నిధులు సమకూర్చలేదు. ఫ్యాక్టరీ యాజమాన్యం అనేకమార్లు ప్రభుత్వానికి లేఖలు ఇచ్చినా ఫలితం లేకపోయింది. 2024 నుంచి రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ఫ్యాక్టరీ క్రషింగ్ చేయకుండా వదిలేసింది.
రెండేళ్లుగా ఇటు పాత బకాయిలు ఇవ్వక, మరో పక్క ఫ్యాక్టరీ క్రషింగ్ కూడా చేయకపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. రైతులు, అఖిల పక్షాలు, రైతు సంఘాలు పరోక్ష, ప్రత్యక్ష పోరాటాలు చేసి చేసి అలసిపోయారు. మరో పక్క ఫ్యాక్టరీ క్రషింగ్ చేయకుండా మూసేయడంతో కార్మికులకు, సిబ్బందికి కూడా నెలవారీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకూ కార్మికులకు కూడా సుమారు రూ. 3కోట్లు మేర జీతభత్యాలు చెల్లించాల్సి ఉంది. దీంతో రైతులు, కార్మికులు కూడా కలిసి అనేక పోరాటాలు చేశారు. అయినా ప్రభుత్వం ఎటువంటి సాయం చేయలేదు. బకాయిల కోసం రైతులు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో ఏటా నిర్వహించాల్సిన ఫ్యాక్టరీ సభ్య రైతుల మహాజన సభలు కూడా రెండేళ్లుగా నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీ రైతుల పక్షాన ఆందోళన దిగేందుకు సిద్ధమైంది. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాఽథ్, మాజీ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో ఈనెల 28న ఫ్యాక్టరీ ఆవరణలో చెరకు రైతుల మహాజన సభను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి, పోరాటానికి ఆ పార్టీ సిద్ధమైంది. మరో నాలుగురోజుల్లో మహాజనసభ ఏర్పాటుకు కరపత్రాలు కూడా సిద్ధం చేసి కాటాల వారీగా రైతులకు ఇచ్చి చైతన్యం చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ పరిస్థితుల్లో స్థానిక అధికార పార్టీ నాయకులపై ఒత్తిడి కూడా పెరిగింది. దీంతో బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ముందు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, వైఎస్సార్‌సీపీ ఉద్యమానికి సిద్ధం, చెరకు రైతుల ఆగ్రహంపై స్థానిక ఎమ్మెల్యే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో ఎట్టకేలకు మంత్రివర్గ సమావేశంలో గోవాడ చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆమోదం తెలిపింది. రెండేళ్లకై నా ప్రభుత్వం దిగివచ్చి రైతుల బకాయిలు చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేయడం శుభపరిణామమే. అయితే బకాయిలు ఇవ్వడానికి నిధులు వెంటనే ఇస్తే మంచిదని రైతులు కోరుతున్నారు.


