తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటన | - | Sakshi
Sakshi News home page

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటన

Sep 24 2026 1:36 AM | Updated on Sep 24 2026 1:36 AM

అచ్యుతాపురం రూరల్‌ : తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పంటల పరిస్థితిని తెలుసుకునేందుకు కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌, జేసీ శౌర్యమాన్‌, జిల్లా వ్యవసాయాధికారి ఆశాదేవి బుధవారం మండలంలో పెదపాడు, ఎంజేపురం గ్రామాల్లో పర్యటించారు. పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. తుపాను ప్రభావంతో పంటలకు ఏర్పడిన పరిస్థితులు, సాగు పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెదపాడు గ్రామంలో నాట్లు వేసిన వరి పొలాలను పరిశీలించిన కలెక్టర్‌ ప్రస్తుత పరిస్థితుల్లో వరి నాట్లు వేసుకోవడానికి అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. తుపాను కారణంగా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనల మేరకు నాట్లు వేసుకోవాలన్నారు. చోడి, జనుము, కొర్రలు వంటి తదితర పంటలకు నాట్లు వేసుకోవడానికి కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. రైతులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయ శాఖ సూచనల మేరకు సాగు పనులు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా, వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అచ్యుతాపురం తహసీల్దార్‌ డి.శ్రీను, మండల వ్యవసాయాధికారి శంకర్‌ గోవింద్‌, డీపీఎం (ఏపీసీఎన్‌ఎఫ్‌) లచ్చన్న, సుమంత అధికారులు పాల్గొన్నారు.

పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

రాంబిల్లి: పరిశ్రమల ఏర్పాటులో పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకారం అందజేస్తామని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. బుధవారం ఆమె రాంబిల్లి సెజ్‌లో 125 ఎకరాల్లో అత్యాధునిక ఆటోమేషన్‌ సాంకేతికతతో నిర్మాణంలో ఉన్న యాక్షన్‌ టెసా ప్లాంట్‌ను పరిశీలించారు. అనంతరం రూ.2300 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న బ్లూ జెట్‌ హెల్త్‌కేర్‌ పరిశ్రమను సందర్శించి, నిర్మాణ పురోగతిపై ప్రతినిధులతో చర్చించారు. అనకాపల్లి జిల్లా పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు కలిగిన ప్రాంతమని పేర్కొన్నారు. వైజాగ్‌ పోర్ట్‌ కనెక్టివిటీ, తగినంత భూ లభ్యత, నైపుణ్యం గల మానవ వనరులు వంటి అంశాలు పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేయాలని యాజమాన్యాలను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement