మాడుగుల : మండలంలో అధిక జలవనరులు గల పెద్దేరు జలాశయానికి వరద పోటు కొనసాగుతుంది. ప్రస్తుతం జలాశయంలోకి 150 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో జలాశయం అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. జలాశయం గరిష్ట నీటి మట్టం 137 మీటర్లు కాగా ప్రస్తుతం 129.10 మీటర్లకు చేరుకుంది. దీంతో రైతులు ఆయకట్టు భూములకు సాగునీటికి ఢోకా లేదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రైవాడలోకి 300 క్యూసెక్కులు...
దేవరాపల్లి : తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రైవాడ జలాశయంలోకి సుమారు 300 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లు కాగా ప్రస్తుతం బుధవారం సాయంత్రానికి 113 మీటర్లుకు చేరుకుందని జలాశయం డీఈఈ జి. సత్యంనాయుడు తెలిపారు. రెండు రోజుల క్రితం వరకు 102.80 మీటర్ల వద్ద ఉన్న నీటి మట్టం క్రమేపి పెరుగుతుండటం పట్ల ఆయుకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంట పొలాలతో పాటు చెరువుల్లో భారీగా వర్షపు నీరు చేరింది. వర్షాలతో శారదానదిలో భారీగా వరదనీరు ప్రవహిస్తుండడంతో కళకళలాడుతుంది.


