● నర్సీపట్నం, చోడవరం, కశింకోటలో విస్తృతంగా తనిఖీలు
● పెద్ద సంఖ్యలో ద్విచక్రవాహనాలు స్వాధీనం
నర్సీపట్నం: పట్టణంలోని 3వ వార్డులో డీఎస్పీ పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పట్టణ సీఐ ఎస్‌కె.గఫూర్, రూరల్ సీఐ రేవతమ్మ, ఎస్‌ఐలు, ఈగల్ టీమ్ సిబ్బంది, నార్కోటిక్ డాగ్స్ సహకారంతో శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 50 మంది పోలీసు సిబ్బందితో 230 ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. దాదాపు 440 మంది వివరాలను సేకరించారు. నార్కోటిక్ స్నిఫర్ డాగ్ బన్నీ సహాయంతో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిల్వలు, రవాణా, వినియోగంపై అనుమానిత ప్రాంతాలు, ఇళ్లు, వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు అనుమానిస్తున్న 8 మంది ఇళ్లు, పాత ఎన్‌డీపీఎస్ కేసులో నిందితుడైన ఒకరి ఇల్లు, ఐదుగురు రౌడీ, సస్పెక్ట్ షీటర్ల నివాసాలను పరిశీలించి, వివరాలను నమోదు చేసుకున్నారు. పత్రాలు లేని 34 వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులు, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల రవాణా, విక్రయాలు, వినియోగానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాలు, కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.
చోడవరం: పట్టణంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు స్పెషల్ పోలీసు బృందాలు, డాగ్ స్క్వాడ్ బృందాలతో అన్ని ప్రాంతాలను జల్లెడ పట్టారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్, ఆటోస్టాండ్, పాతబస్టాండ్, కొత్తూరు జంక్షన్లలో ప్రయాణికులు, విద్యార్థులు, అనుమానాస్పద వ్యక్తుల బ్యాగులు తనిఖీ చేశారు. చోడవరం సీఐ అప్పలరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేశాయి. ఒకే సారి డాగ్ స్క్వాడ్‌తో పోలీసు బృందాలు రంగంలోకి దిగడంతో అంతా భయాందోళనలకు గురయ్యారు.
కశింకోట: మండల కేంద్రం కశింకోటలోని పలు ప్రాంతాల్లో శనివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రధానంగా మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతున్నట్టు అనుమానం ఉన్న ప్రాంతాలు, ఇళ్లు, విద్యార్థుల హాస్టళ్లు, ఖాళీ భవనాలు, బస్ స్టేషన్, ఇతర అనుమానాస్పద ప్రదేశాలు, గంజాయి, నార్కోటిక్ కేసుల్లోని నిందితుల ఇళ్లలో సోదాలు చేశారు. సుమారు 600 మంది వ్యక్తులను, 150 వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 37 వాహనాలు, ఆరు లిక్కర్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు ఉన్న వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. డీఎస్పీ ఈ. శ్రీనివాసులు ఆధ్వర్యంలో సీఐ అల్లు స్వామినాయుడు స్థానిక హౌసింగ్ కాలనీ, పూసర్ల వీధి ప్రాంతాల్లో ఈగల్ టీంతో కలిసి తనిఖీలు జరిపారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల గురించి తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1972కు గానీ, పోలీసులకు గానీ సమాచారం అందించాలన్నారు. అనంతరం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అనకాపల్లి ట్రాఫిక్ సీఐ వెంకట నారా యణ, అనకాపల్లి టౌన్ సీఐ ప్రేమ్‌కుమార్, రూరల్ సీఐ అశోక్ కుమార్, ఈగల్ ఇన్‌స్పెక్టర్ ఎస్. నారాయణరావు, కశింకోట ఎస్‌ఐలు కె. లక్ష్మణరావు, బి.సతీష్, 70 మంది సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో నర్సీపట్నం, చోడవరం, కశింకోటల్లో శనివారం పోలీసులు పెద్ద ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సోదాలు జరిపారు. సరైన రికార్డులు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు రావడంతో ఆయా ప్రాంతాల వారు భయాందోళనలకు గురయ్యారు.


