అడుగడుగునా అడ్డంకులు..ఆశలపై నీళ్లు | - | Sakshi
Sakshi News home page

అడుగడుగునా అడ్డంకులు..ఆశలపై నీళ్లు

Sep 20 2026 12:39 AM | Updated on Sep 20 2026 12:39 AM

నిరాశ నిస్పృహలకు గురైన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు కుంటిసాకులతో పెన్షన్‌ దరఖాస్తుల స్వీకరణకు నిరాకరణ కూటమి నాయకుల సిఫారసులకే ప్రాధాన్యం
జిల్లాలో వివరాలు

తుమ్మపాల: చంద్రబాబు ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఏ ఒక్కరికీ కొత్తగా పింఛన్లు మంజూరు చేయలేదు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకు కొత్తగా ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద పింఛన్ల డ్రామాకు తెరలేపింది. పెన్షన్‌ మంజూరైతే పూటగడుస్తుందన్న ఎన్నో ఆశలు పెట్టుకున్న అభాగ్యులతో ఆటలాడుకుంది. సామాజిక భద్రతా పింఛన్ల కోసం ఈ నెల 7 నుంచి 18వ తేదీ వరకూ అర్హులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు తదితరులున్నారు. అయితే దరఖాస్తుల స్వీకరణ సమయంలో చాలా అడ్డంకులు సృష్టించారు. దీంతో అర్హత ఉన్నా అనేకమంది దరఖాస్తు చేయలేకపోయారు. అర్హత పరిశీలనలో ఎంత మంది గట్టెక్కుతారు? నిబంధనల పేరుతో ఎంత మంది దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి? అనేది చర్చనీయాంశంగా మారింది.

40,725 దరఖాస్తులు

జిల్లాలోని 24 మండలాల్లో ఈ నెల 18 నాటికి 40,725 దరఖాస్తులు నమోదైనట్లు స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సచివాలయాల జిల్లా అధికారి బి.వి.సత్యనారాయణ తెలిపారు. వీటిలో 37,164 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా కేవలం 3,157 మాత్రమే ఆమోదం పొందాయి. 404 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయన్నారు.

సచివాలయాల వద్దే ‘నో’..

దరఖాస్తు చేసుకునేందుకు సచివాలయాలకు వెళ్లిన పలువురిని వివిధ కారణాలు చూపుతూ వెనక్కి పంపించారనే ఆరోపణలు పలు మండలాల్లో వినిపించాయి. కొన్నిచోట్ల స్థానిక కూటమి నాయకుల జోక్యం ఎక్కువైందని, తమకు అనుకూలంగా ఉన్న వారి దరఖాస్తుల స్వీకరణలో ప్రాధాన్యం లభించిందని పలువురు తెలిపారు. మరికొన్ని గ్రామాల్లో కూటమి నాయకులు అంగీకారం తెలుపుతూ ఫారాలపై సంతకాలు చేస్తేనే సచివాలయ సిబ్బంది దరఖాస్తులను స్వీకరించి నమోదు చేశారు. వాటిలో కొన్నింటికి నేటికీ సంతకాలు లేక ఫారాలు సమర్పించకపోవడంతో అవి పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో సంతకాల కోసం కూటమి నాయకుల చుట్టూ దరఖాస్తుదారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో దరఖాస్తుదారుల నుంచి కూటమి నాయకులు నగదు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు సాంకేతిక సమస్యలు, నిబంధనలు, టీడీపీ నాయకుల హడావుడి అడ్డంకులుగా మారా యి. అర్హత ఉన్నప్పటికీ పలు కారణాలతో దరఖాస్తులు నమోదుకాకపోవడంతో వారు తీవ్ర నిరాశనిస్పృహలకు గురయ్యారు. కుంటిసాకులు చెప్పి తమ దరఖాస్తులు స్వీకరించకుండా వెనక్కు పంపేశారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement