కూటమి నిర్లక్ష్యం.. రైతన్నకు కష్టం! | - | Sakshi
Sakshi News home page

కూటమి నిర్లక్ష్యం.. రైతన్నకు కష్టం!

Sep 20 2026 12:39 AM | Updated on Sep 20 2026 12:39 AM

కరువు నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలం అనకాపల్లిని కరువు జిల్లాగాప్రకటించాలి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌

మునగపాక: కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరువు పరిస్థితులు దాపురించాయని, ఎల్‌ నినో ప్రభావం ఉంటుందని ముందుగా తెలిసినా సమర్థంగా ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ ఆరోపించారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులను ఆదుకోకుండా సీఎం చంద్రబాబు ఫొటో షూట్లు, పొర్లు దండాలతో కాలం గడిపేస్తున్నారని విమర్శించారు. ఎల్‌ నినో ప్రభావం ఎక్కు వగా ఉంటుందని తెలిసినా చంద్రబాబు ప్రభుత్వం ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అన్నదాతకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈఏడాది 44 శాతం వర్షపాతం లోటు నమోదైందన్నారు. అయినా ఇంతవరకు పాలకులు గాని, అధికారులు గాని కనీసం సమీక్షలు నిర్వహించకపోవడం విచారకరమన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. చంద్రబాబునాయుడు తన ఇమేజ్‌ పెంచుకునేందుకు చూపుతున్న శ్రద్ధ రైతులపై చూపితే బాగుండేదని తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాల వారిని ఆదుకుని అందరి మన్ననలు పొందారన్నారు. రైతులను ఆదుకునేందుకు పంటల బీమా పథకం అమలు చేసి రైతు పక్షపాతిగా గుర్తింపు పొందారని చెప్పారు. నేడు చంద్రబాబు కనీసం రైతులకు పంటల బీమా పథకం అమలు చేసే చర్యలు చేపట్టలేదన్నారు.

అగమ్యగోచరంగా అన్నదాతలు

జిల్లా వ్యాప్తంగా 3.70 లక్షల ఎకరాల సాగు భూమి ఉందని, ఇందులో 1.40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉండగా, 18,250 ఎకరాల్లో సాగు జరుగుతోందన్నారు. వేసిన పంటలు ఎండిపోయాయని, దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని చెప్పారు. పోలవరం నీరు వచ్చేస్తుందంటూ హంగామా చేయడం తప్ప ఈ ప్రాంత రైతులకు ఒరిగిందేమీలేదన్నారు. అన్నదాత సుఖీభవ పథకం సక్రమంగా అమలు కాలేదని తెలిపారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అందువల్ల అనకాపల్లిని కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి కూలీలకు పనిదినాలు పెంచాలని కోరారు.

రైతుల కోసం పోరాడతాం

రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణకు శ్రీకారం చుడుతోందన్నారు. రైతులకు న్యాయం జరిగేంతవరకు రాజీలేని పోరాటం చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్‌ ఆడారి అచ్చియ్యనాయుడు, వైస్‌ ఎంపీపీ మళ్ల కాశీ సురేష్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆడారి కాశీబాబు, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కాండ్రేగుల జగన్‌, మాజీ సర్పంచ్‌ బొడ్డేడ శ్రీనివాసరావు, పార్టీ నేతలు నరాలశెట్టి సూర్యనారాయణ, రాజాన బుజ్జిబాబు, పిన్నమరాజు రవీంద్రరాజు, దొడ్డి బుజ్జి, గుంట్ల అప్పారావు, పిట్టా మంగారెడ్డి, వెలగా రామకృష్ణ, భీశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement