మహారాణిపేట(విశాఖ): త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల తుది జాబితాను విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో కె.రాజ్‌కుమార్, జెడ్పీ పర్యవేక్షకుడు మూర్తి ప్రదర్శించారు. ఉమ్మడి విశాఖ జిల్లాల పరిధిలోని 39 మండలాల్లో మొత్తం 2,350 పోలింగ్ కేంద్రాలను ఖరారు చేశారు. వీటిలో విశాఖ జిల్లాలో 203, అనకాపల్లి జిల్లాలో 1,530, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 617 కేంద్రాలు ఉన్నాయి. జెడ్పీ అధికారులు ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జెడ్పీ సీఈవో తెలిపారు.
జిల్లా పరిషత్‌లకు 25 నుంచి ప్రత్యేక అధికారుల పాలన
మహారాణిపేట(విశాఖ): జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 24తో ముగియనున్న నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాలోని జిల్లా పరిషత్ లకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, అనకాపల్లి జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ విజయకృష్ణన్, అల్లూరి జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ పి.నిశాంతిని నియమించింది. ఈ నెల 25 నుంచి జిల్లా పరిషత్‌లలో ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి రానుంది.


