తుమ్మపాల: అనకాపల్లి మండలం మార్టూరు జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతున్నారన్న ఆరోపణలపై ఆ పాఠశాల హెచ్‌ఎం విజయ, మధ్యాహ్నభోజన నిర్వాహకురాలికి జిల్లా విద్యాశాఖాధికారి జి.జి.ఎస్.నాగేశ్వరరావు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో శుక్రవారం పాఠశాల వద్ద తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఈ ఆందోళనపై ‘నాసిరకంగా బడి భోజనం‘ అనే శీర్షికన సాక్షిలో ప్రచురించిన వార్తకు స్పందించిన డీఈవో శనివారం పాఠశాలను సందర్శించి విచారణ జరిపారు. బాధ్యులుగా గుర్తించిన హెచ్‌ఎం విజయ, ఎండీఎం నిర్వాహకురాలికి షోకాజ్ నోటీసులు జారీచేసి, గడువులోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు రావడంతో భోజనం తయారీపై విచారణ చేశామని, నివేదికలను కలెక్టర్, విద్యాశాఖ, ఎండీఎం ఉన్నతాధికారులకు సమర్పిస్తామని డీఈవో తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకుంటామని, భోజనం తయారీలో ఎటువంటి తప్పిదాలు జరిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించడంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. విచారణ పూర్తయ్యేవరకు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏడీ అప్పారావునాయుడు, ఎంఈవో–1 శ్రీదేవి, ఎంఈవో–2 విశ్వేశ్వరరావు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


