జగనన్న లేఅవుట్లపై కూటమి కళ్లు? | - | Sakshi
Sakshi News home page

జగనన్న లేఅవుట్లపై కూటమి కళ్లు?

Sep 19 2026 4:20 AM | Updated on Sep 19 2026 4:20 AM

● సచివాలయ సిబ్బంది ద్వారా ఖాళీస్థలాల గుర్తింపు ● స్వాధీనం చేసుకునేందుకు సన్నాహాలు ? ● లబ్ధిదారుల్లో ఆందోళన

ఆందోళన రేపుతున్న సర్వే

పాయకరావుపేట మండలం పి.ఎల్‌.పురం వద్ద ఏర్పాటు చేసిన జగనన్న లేఅవుట్‌లో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లు (ఫైల్‌)

స్థలాలు స్వాధీనం చేసుకుంటే సహించం

త ప్రభుత్వం జగనన్న లేఅవుట్లను ఏర్పాటు చేసి సెంటున్నర స్థలాన్ని మంజూరు చేసింది. చాలా మంది ఇళ్లు నిర్మించుకున్నారు. అక్కడక్కడ కొంతమంది వివిధ కారణాల వల్ల నిర్మించుకోలేదు. ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా ఖాళీ స్థలాలను గుర్తిస్తోంది. వీటిని స్వాధీనం చేసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే వైఎస్సార్‌సీపీ తరఫున పోరాటం చేస్తాం. జగనన్న ఇచ్చిన స్థలాలను తీసుకుని టీడీపీ కార్యకర్తలకు పంచుతామంటే ఒప్పుకునేది లేదు. ప్రభుత్వం కొత్తగా భూసేకరణ జరిపి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, అంతే తప్ప గతప్రభుత్వం ఇచ్చిన స్థలాలు స్వాధీనం చేసుకుని కొత్తవారికి ఇస్తామంటే కుదరదు.నాలుగు పర్యాయాలు సీఎంగా చేసిన చంద్రబాబు ఒక్క సెంటుకూడా ఇంటి స్థలం ఇవ్వలేదు. – వీసం రామకృష్ణ, వైఎస్సార్‌సీపీ రాష్ట్రకార్యదర్శి

నక్కపల్లి : గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా మంజూరు చేసిన జగనన్న లేఅవుట్లపై కూటమి ప్రభుత్వ కళ్లు పడ్డాయి. గత ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో వివిధ కారణాలు, ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఇళ్లు నిర్మించకుండా ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి వాటి వివరాలను సేకరించేందుకు అధికారులు జగనన్న లేఅవుట్లలో పర్యటిస్తున్నారు. గతంలో ఇళ్ల స్థలాలు ఎంతమందికి ఇచ్చారు. వాటిలో ఎంతమంది ఇళ్లు నిర్మించుకున్నారు. ఎంత మంది నిర్మించుకోలేదు తదితర వివరాలను సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది ద్వారా ప్రభుత్వం సేకరిస్తోంది. శుక్రవారం నుంచి సచివాలయ ఇంజినీరింగ్‌, వెల్ఫేర్‌, డిజిటల్‌ అసిస్టెంట్లు జగనన్న లేఅవుట్లలో ఖాళీ స్థలాల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. నిర్మాణాలు ప్రారంభించకుండా ఖాళీగా ఉన్న స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వేరొకరికి పట్టాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే గతంలో జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2020–21 ఆర్థిక సంవత్సరంలో ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు మంజూరు చేయాలనే లక్ష్యంతో వైఎస్సార్‌ గృహనిర్మాణ పథకాన్ని అమలు చేసింది. దీనిలో భాగంగా జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి, ప్రభుత్వమే భూమిని కొనుగోలు చేసి లేఅవుట్లను అభివృద్ధి చేసి, జగనన్న కాలనీగా నామకరణం చేసింది. మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ఒక్కో లబ్ధిదారుడికి సెంటున్నర(72 చదరపు గజాల) సెంట్ల ఇంటి స్థలాన్ని ఉచితంగా పంపిణీ చేసింది. అంతే కాకుండా ఇల్లు నిర్మించుకునేందుకు రూ.1.80లక్షల ఆర్థిక సాయాన్ని అందజేసింది.

682 జగనన్న కాలనీలు

జిల్లాలో 20 మండలాల్లో 682 జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి సుమారు 35 వేల మందికి ఇంటి స్థలాలను పంపిణీ చేసి, ఇళ్లు మంజూరు చేసింది. ఇలా జిల్లాలో జగనన్న లేఅవుట్లతో పాటు, సొంత ఇంటి స్థలాలు కలిగిన వారితో కలిపి సుమారు 68 వేల మందికి ఇళ్లు మంజూరు చేసింది. వీటిలో 62వేల ఇళ్లను గృహనిర్మాణ శాఖ ద్వారాను, 5,500 ఇళ్లను టిడ్కో ద్వారా మంజూరు చేసింది. రూ.1,054 కోట్లు గ్రాంటు కూడా విడుదల చేసింది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో జగనన్నకాలనీల్లో జిల్లాలో అప్పట్లో సుమారు 25 వేల మంది ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి గృహప్రవేశాలు కూడా జరపుకొన్నారు. మిగిలిన స్థలాల్లో కొంత మంది పునాదులు నిర్మించి దఫదఫాలుగా నిర్మాణాలు చేపడుతున్నారు. మరికొంతమంది ఆర్థిక స్థోమత లేకపోవడం, సమయానికి డబ్బులు లేకపోవడం సరైన రోడ్డు సదుపాయం లేకపోవడం వంటి కారణాలతో నిర్మాణాలు ప్రారంభించలేదు.

టీడీపీ కార్యకర్తలకు కట్టబెట్టే కుట్ర?

జిల్లాలో సుమారు 3 వేల నుంచి 5 వేల వరకూ ఖాళీ స్థలాలున్నట్టు ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ఖాళీ స్థలాలపై కూటమి ప్రభుత్వం కళ్లు పడ్డాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రక్రియలో భాగంగా గత ప్రభుత్వం మంజూరు చేసిన జగనన్న కాలనీల్లో ఖాళీ స్థలాల వివరాలను సేకరించి వాటిని స్వాధీనం చేసుకుని టీడీపీ కార్యకర్తలకు పంపిణీ చేసే కుట్రకు తెరలేపిందన్న ప్రచారం జరుగుతోంది. పేదలకు స్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఈ రెండేళ్లకాలంలో ఎక్కడా భూసేకరణ జరపలేదు. స్థలాలను కొనుగోలు చేయలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన స్థలాలనే స్వాధీనం చేసుకుని కొత్త సీసాలో పాత సారా అన్నట్లుగా పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా సచివాలయ సిబ్బంది జగనన్న లేఅవట్లులో ఖాళీ స్థలాలను గుర్తించి వివరాలు నమోదు చేసుకోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. జగనన్న ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాలను కూటమిప్రభుత్వం లాగేసుకుంటుందనన్న భయాందోళన లబ్ధిదారులను వెంటాడుతోంది. తమకు సెంటు భూమి లేకపోవడంతో గత ప్రభుత్వం ఇల్లు నిర్మించుకునేందుకు స్థలాన్ని కేటాయించిందని, ఆర్థిక ఇబ్బందులు కారణంగా వెంటనే ఇంటి నిర్మాణాలను ప్రారంభించలేదని లబ్ధిదారులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయలేదని, రెండేళ్లనుంచి కొత్త ఇళ్లనిర్మాణానికి ఒక్క పైసాకూడా ఆర్థిక సాయం అందించలేదనివారు చెబుతున్నారు. ప్రభుత్వం మంజూరు చేసి ఉంటే ఇల్లు నిర్మించుకునే వారమని తెలిపారు. ఖాళీ స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే గనుక లబ్ధిదారుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement