నక్కపల్లి: కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ అన్నారు. రాజయ్యపేటలో గ్రామపెద్దలు సూదుల రమణ, పిక్కి తాతాజీ, పిక్కి నాగరాజులతో సహా వివిధ పార్టీలకు చెందిన 50 మంది శుక్రవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరందరికీ వీసం కండువాలు కప్పి పా ర్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్‌లో భాగంగానే కొత్త పింఛన్లు, ఇళ్లు, ఇంటి స్థలాలు మంజూరు చేస్తామంటూ కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. వేట నిషేధ సమయంలో ఇస్తామన్న మత్స్యకార భరోసా సగం మందికి కూడా ఇవ్వలేదన్నారు. రాజయ్యపేటలో సగానికి పైగా అర్హులైన వారికి వేట నిషేధ భృతి అందలేదని చెప్పారు. అన్నివర్గాల వారికీ కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాబోయే రోజుల్లో పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని, కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకునేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, పార్టీ మండల అధ్యక్షుడు గొర్ల గోవిందరావు, పార్టీ నాయకులు సాదిరెడ్డి శ్రీను, తళ్ల భార్గవ్, పిక్కి తాతాజీ, ఎం. సూరిబాబు, పిక్కి నూకరాజు, యజ్జల అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలు: వీసం


