మునగపాక : మండలంలోని నాగులాపల్లికి చెందిన మహిళ అదృశ్యం ఘటనపై కేసు నమోదు చేసినట్టు హెచ్‌సీ ప్రకాశరావు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నాగులాపల్లికి చెందిన భీమరశెట్టి వెంకట రామనాగేశ్వరరావు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈనెల 16న ఎప్పటివలే నాగేశ్వరరావు తన భార్య వరలక్ష్మితో కలిసి పొలం పనులకు వెళ్లారు. సాయంత్రం వరలక్ష్మి ఇంటికి చేరుకుంది. కొద్దిసేపటి తరువాత ఆమె చేతిలో సంచితో మెయిన్‌రోడ్డుకు చేరుకుంది. రాత్రికి ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. గురువారం కూడా ఆమె ఆచూకీ తెలియక పోవడంతో భర్త నాగేశ్వరరావు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సీ ప్రకాశరావు తెలిపారు.


