యలమంచిలి రూరల్ : మున్సిపాలిటీ పరిధి సోమలింగపాలెం శివారు గోకివాడ ఆనకట్ట వద్ద గురువారం మధ్యాహ్నం పిడుగుపాటుకు గురై ఇద్దరు రజకులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. సోమలింగపాలెం గ్రామానికి చెందిన చూచుకొండ శ్రీను(43), చీపురుపల్లి గంగాధర్(27) శారదానది ఒడ్డున దుస్తులు ఉతకడానికి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో ఓ చెట్టు కిందకు ఇద్దరూ వెళ్లారు. ఆ సమయంలో వారికి అత్యంత సమీపంలో పెద్ద శబ్ధంతో పిడుగు పడడంతో వారిద్దరూ షాక్‌కు గురై స్పృహ కోల్పోయారు. ఘటనను చూసిన ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరినీ గ్రామస్తుల సాయంతో యలమంచిలి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ఇద్దరికీ చికిత్స అందిస్తున్నారు. గురువారం రాత్రి 7 గంటల సమయానికి ఇద్దరూ కోలుకుంటున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరికీ కాలిన గాయాలయ్యాయి. గంగాధర్ వద్ద ఉన్న మొబైల్ ఫోన్ కాలిపోయింది. గాయపడిన ఇద్దరూ బంధువులని గ్రామస్తులు తెలిపారు. మూడు రోజులుగా యలమంచిలి ప్రాంతంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాగులో ఉన్న పంటలకు వర్షం జీవం పోస్తుండగా, పొలాల్లో పనిచేసే రైతులు,కూలీలు పిడుగుల ధాటికి భీతిల్లుతున్నారు.
చికిత్స పొందుతున్న చీపురుపల్లి గంగాధర్ , చూచుకొండ శ్రీను


