స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం

Sep 12 2026 12:48 AM | Updated on Sep 12 2026 12:48 AM

కూటమి వైఫల్యాలను ప్రజలకు వివరించాలి

వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌

కురుసాల కన్నబాబు

వైఎస్సార్‌సీపీ పాయకరావుపేట నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం

నక్కపల్లి/ఎస్‌రాయవరం: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా పనిచేయాలని వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శుక్రవారం అడ్డురోడ్డులో సమన్వయకర్త కంబాల జోగులు అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్యఅతిథులుగా మాజీ మంత్రులు కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌, పార్లమెంట్‌ పరిశీలకురాలు శోభా హైమావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై రెండేళ్లలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోలేమనే భయం ఆ పార్టీ నాయకుల్లో ఉందన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే కొత్త పింఛన్లు అంటూ హడావుడి చేస్తూ దరఖాస్తులు స్వీకరిస్తున్నారని విమర్శించారు. రెండేళ్లుగా కొత్త పింఛన్లపై నోరు మెదపని ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు.

ఎన్నికల ముందు బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని ప్రకటించారని, ఇప్పుడు వారి గురించి ప్రస్తావించడం లేదన్నారు. పేదలపై కూటమి ప్రభుత్వం కురిపిస్తున్న కపట ప్రేమను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. స్థానిక ఎన్నికలను ధీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పార్టీని మరింత బలోపేతం చేసే బాధ్యత ప్రతి కార్యకర్త, నాయకుడిపై ఉందన్నారు. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పటికీ పార్టీ కేడర్‌ మాత్రం చెక్కు చెదరలేదన్నారు. గ్రామాల్లో కార్యకర్తలు ఆత్మస్థైర్యంతో ఉన్నారని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో ఏకాభిప్రాయంతో బలమైన అభ్యర్థులను బరిలో దింపితే గెలుపు సునాయాసమని చెప్పారు. ఆ దిశగా జిల్లా, మండల నాయకత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడ ఏ తప్పిదం జరిగినా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే మన గెలుపు ఖాయమన్నారు.

అవినీతిలో కూరుకుపోయిన కూటమి సర్కార్‌

మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, పార్టీ పరిశీలకురాలు శోభా హైమావతి, సమన్వయకర్త కంబాల జోగులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అనేక అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందన్నారు. ముఖ్యంగా డీఎస్సీలో జరిగిన అవినీతిపై రాష్ట్రమంతా చర్చించుకుంటోందని తెలిపారు. ఉపాధ్యాయుల పోస్టులన్నీ టీడీపీ వారికి, అర్హత లేని వారికి ఇచ్చారని ఆరోపించారు. ఆధారాలతో సహా దొరికిపోవడంతో ప్రజల దృష్టిని, అర్హులైన నిరుద్యోగుల దృష్టిని మరల్చడం కోసం కొత్త పింఛన్లను తెర మీదకు తెచ్చారన్నారు. దరఖాస్తులు కూడా టీడీపీ కార్యకర్తల ద్వారా తీసుకుంటున్నారన్నారు. సచివాలయాల్లో అధికారులు చేయాల్సిన పని టీడీపీ కార్యకర్తలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన వారికి రానున్న రోజుల్లో మంచి గుర్తింపు ఉంటుందన్నారు. ఈ దఫా అధికారంలోకి వస్తే కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని జగన్‌మోహన్‌రెడ్డి పలు సందర్భాల్లో చెప్పారని, ఏ ఒక్క కార్యకర్త నిరాశ చెందవద్దని తెలిపారు. గ్రామాల్లో జరిగే అన్ని స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున అభ్యర్థి పోటీలో ఉండాల్సిందేనని చెప్పారు.కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు బుద్ధి చెబుదామా అని ప్రజలు వేచి ఉన్నారని తెలిపారు. అధికార పార్టీ నాయకులకు గ్రామాల్లో ఓటు అడిగే అర్హత లేదన్నారు. చంద్రబాబు చేసే జిమ్మిక్కులను ప్రజలు గమనిస్తున్నారని, మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు. ప్రజలను ఓటు అడిగే హక్కు, అర్హత ఒక్క వైఎస్సార్‌సీపీకి మాత్రమే ఉందన్నారు. గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఐదేళ్లలోనే అమలు చేశామని తెలిపారు. కూటమి నాయకులు ఈవీఎంలను మేనేజ్‌ చేసి అధికారంలోకి వచ్చారన్నారు.

ఈ సమావేశంలో 8,400 మంది నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్సీ డి.వి. సూర్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, చెంగల వెంకటరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, నియోజకవర్గ పరిశీలకులు దంతులూరి దిలీప్‌కుమార్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దత్తుడు సీతబాబు, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు మధువర్మ, గొర్ల గోవిందు, పైలా రమేష్‌, గెడ్డమూరి శ్రీను, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గొర్ల నర్సింహమూర్తి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శీరం నర్సింహమూర్తి, రాష్ట్ర కార్యదర్శులు ఎల్‌. చంద్రరావు, సూరాకాసుల గోవిందు, నియోజకవర్గ పంచాయతీరాజ్‌ అధ్యక్షుడు కర్రి సత్యనారాయణ, మండల యూత్‌ అధ్యక్షుడు వి.సింహాద్రి, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు పోశిన నరేష్‌, జెడ్పీటీసీలు గోసల కాసులమ్మ, లంక సూరిబాబు, ఎంపీపీలు పార్వతి తాతారావు, వైస్‌ ఎంపీపీ వెలగా ఈశ్వరరావు, సీనియర్‌ నాయకులు దగ్గుపల్లి సాయిబాబు, జగతా శ్రీను, మహిళా కార్యదర్శి సుందర లత, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు కాకర వెంకటరావు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు యలమంచలి చందు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement