● తరలించేందుకు కొండపైకి సువిశాల రోడ్డు నిర్మాణం
● పట్టపగలే తరలిపోతున్నా
పట్టించుకోని అటవీశాఖ అధికారులు
దేవరాపల్లి: మండలంలోని గరిశింగి పంచాయతీ శివారు చినగంగవరం నుంచి చింతలపాలెం వరకు ఉన్న అటవీ ప్రాంతంలో ఏపుగా పెరిగిన చెట్లను అక్రమంగా నరికి తరలించుకుపోతున్నారు. ఇందుకోసం కొండపైకి సుమారు 15 అడుగుల వెడల్పున రోడ్డు నిర్మించారు. జీడి, టేకు, ఏగిస, పనస తదితర భారీ వృక్షాలను నరికి పెందుర్తి తదితర ప్రాంతాలకు పట్టపగలే తరలించేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటవీశాఖ అధికారులు చోద్యం చూడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులకు తెలిసే ఇదంతా జరుగుతోందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అటవీ ప్రాంతంలో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు సైతం అభ్యంతరం తెలిపే అటవీశాఖ అధికారులు.. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ అక్రమంగా అటవీ సంపదను కొల్లగొడుతున్నా మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికై నా అటవీశాఖ అధికారులు స్పందించి కలప అక్రమ నరికివేత, తరలింపుపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అటవీశాఖ బీట్ ఆఫీసర్ నటరాజన్‌ను సంప్రదించగా చెట్ల నరికివేతపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.


