ఆది పూజలు అందుకునే దేవుడు... సకల ప్రమథ గణాలకు అధిపతి అయిన వినాయకుని పూజిస్తే కార్యసిద్ధి తప్పకుండా కలుగుతుందని విశ్వాసం. కార్యసిద్ధి గణపతిగా ప్రసిద్ధి చెందిన చోడవరంలో వెలసిన స్వయంభూ విఘ్నేశ్వరుడి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఆలయాన్ని ఉత్తరాంధ్ర వాసుల కాణిపాకంగా వ్యవహరిస్తారు.
చోడవరంలో 14 నుంచి నవరాత్రి ఉత్సవాలు ● భారీగా ఏర్పాట్లు
చోడవరంలో స్వయంభూ విఘ్నేశ్వరస్వామిఆలయం ప్రధాన సింహద్వారం
చోడవరం: రాష్ట్రంలో విశిష్టత కలిగిన స్వయంభూ విఘ్నేశ్వరాలయాలు రెండు ఉండగా వాటిలో ఒకటి చిత్తూరు జిల్లా కాణిపాకంలో, రెండవది విశాఖజిల్లా చోడవరంలో ఉంది. ఆదిదేవుడై, ఆపద్బాంధు వుడిగా, కోర్కెలు తీర్చే బొజ్జగణపతిగా, విద్యార్థు లకు ఆరాధ్యదేవుడిగా శ్రీ స్వయంభూ విఘ్నేశ్వరస్వామి పూజలందుకుంటున్నారు. తనను ఆశ్రయించిన భక్తుల కోరికలు తీరుస్తూ వారి పాలిట కొంగుబంగారమై భాసిల్లుతున్న ఈ స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి.
300 ఏళ్ల చరిత్ర
సుమారు 300 ఏళ్లనాటి చరిత్ర కలిగిన చోడవరం ప్రధాన రహదారిని ఆనుకుని తూర్పుదిశగా ఉన్న ఈ ఆలయంలో విఘ్నేశ్వరుని విగ్రహం నడుము పైభాగం మాత్రమే దర్శనమిస్తుంది. స్వామివారి తొండం చివరిభాగం పైకి కనిపించదు. ఈ విగ్రహం ఏటేటా పెరుగుతుందని ప్రతీతి ఉంది. పాతచెరువు ఒడ్డున ఉన్న ఈ స్వయంభూ వినాయకుని విగ్రహాన్ని పక్కనే ఉన్న స్వయంభూ గౌరీశ్వరాలయంలోకి తరలించడానికి అప్పట్లో తవ్వకాలు జరిపించగా, ఎంత తవ్వినా స్వామివారి తొండం చివరి భాగం కనిపించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు పూర్వీకులు చెబుతారు. తవ్వకాన్ని జరిపిన ప్రాంతాన్ని ‘ఏనుగుబోదె’గా పిలుస్తుంటారు. ఒకనాడు జీర్ణావస్థలో ఉన్న ఈ స్వయంభూ విఘ్నేశ్వరాలయాన్ని 1856లో చుండూరు వెంకన్న పంతులు ఆధ్వర్యంలో కొడమంచిలి చలపతిరావు అర్చకత్వంలో పునఃసంప్రోక్షణ జరిపారు. 1875లో కొడమంచిలి గణేష్, పలువురు కలసి స్థాపించిన శ్రీ బాలగణపతి సంఘం సహకారంతో ఈ ఆలయ పునఃనిర్మాణం చేపట్టారు. దేవదాయ ధర్మాదాయశాఖ ఆధీనంలో స్వామి వారికి పూజలు జరుగుతూ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతోంది. ఈ ఆలయానికి ఉత్తర రాజగోపురం మాత్రమే ఉండేది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చొరవతో సుమారు రూ. 3కోట్ల వ్యయంతో తూర్పు, పశ్చిమం, దక్షిణ రాజగోపురాలు నిర్మించారు. సుమారు 40 అడుగుల ఎత్తులో నిర్మించిన తూర్పు రాజగోపురం ఆలయానికి సరికొత్త ఆధ్యాత్మిక శోభను తెచ్చింది. మాడవీధుల నిర్మాణంలో భాగంగా మూడు రాజగోపురాలను కలుపుతూ రోడ్డు వేశారు. ఆలయ ప్రాంగణంలో ప్రతీ బుధ, శుక్రవారాల్లో గణపతి, లక్ష్మీగణపతి హోమాలు, లోకకల్యాణం కోసం నిర్వహించే హోమాలు కోసం ప్రత్యేకంగా యాగశాల ఉంది. ఆలయప్రాంగణంలో సంతోషిమాత ఆలయాన్ని కూడా నిర్మించారు. సర్వాంగ సుందరంగా నిర్మించిన ఈ ఆలయంలో భూమిలో వెలసిన శ్రీ స్వయంభూ విఘ్నేశ్వరున్ని దర్శించుకోవడానికి అన్ని ప్రాంతాల నుంచి భక్తులు నిత్యం వస్తారు. స్వామివారికి నిత్యపూజలు, అన్నదాన కార్యక్రమాలు, ప్రత్యేక కుంకుమార్చనలు వేదపండితుల సహస్రోర్చనల మధ్య అర్చనలు జరుపుతారు. నిత్యాన్నదానం ఇక్కడ నిర్వహిస్తున్నారు.
14 నుంచి ఉత్సవాలు
ఈ ఏడాది వినాయక చవితి పండుగ, నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిపేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈనెల 14వ తేదీన వినాయక చవితి పండగ నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజుల పాటు ఈనెల 23వ తేదీ వరకూ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిపేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి రంగులు వేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.


