విజిలెన్స్ దాడిలో 82 బండలు స్వాధీనం
అచ్యుతాపురం రూరల్ : సెజ్ పునరావాస కాలనీలో గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు బయటపడ్డాయి. ఒక గదిని అద్దెకు తీసుకుని అనధికారికంగా వంటగ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచి విక్రయిస్తున్న వ్యక్తిని విజిలెన్స్ అధికారులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు అధికారులు తనిఖీలు నిర్వహించగా భారీగా గ్యాస్ సిలిండర్లు బయటపడటంతో కలకలం రేగింది. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లు 50, వ్యాపార అవసరాలకు ఉపయోగించే కమర్షియల్ సిలిండర్లు ఐదు, అలాగే 5 కేజీల సిలిండర్లు 27 కలిపి మొత్తం 82 సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీరామ గ్యాస్ ఏజెన్సీతో పాటు గాజువాకకు చెందిన మరో గ్యాస్ ఏజెన్సీ నుంచి ఈ సిలిండర్లు సరఫరా అయినట్లు సీఎస్‌డీటీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ వ్యవహారంలో గ్యాస్ ఏజెన్సీల పాత్రపై కూడా విచారణ కొనసాగుతున్నట్టు తెలిపారు.


