స్థానిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగిద్దాం | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగిద్దాం

Sep 11 2026 9:34 AM | Updated on Sep 11 2026 9:34 AM

కూటమి మోసాలను, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

పార్టీ అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా సైనికుల్లా పనిచేయాలి

జగన్‌ సంక్షేమ పాలనే పార్టీ అభ్యర్థుల గెలుపునకు సోపానాలు

మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు

తారువలో నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం

దేవరాపల్లి : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగించేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా సమష్టిగా కృషి చేయాలని మాజీ డిప్యూటీ సీఎం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల రీజనల్‌ కోఆర్డినేటర్‌ బూడి ముత్యాలనాయుడు అన్నారు. తారువలోని డా. వైఎస్సార్‌ ఆడిటోరియంలో మాడుగుల నియోజకవర్గ కార్యకర్తల విస్త్రృత స్థాయి సమావేశం గురువారం జరిగింది. సభా వేదికపై మహానేత వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి అనకాపల్లి పార్లమెంట్‌ పరిశీలకులు శోభా హైమావతి, మాడుగుల నియోజకవర్గ పరిశీలకులు పైలా శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జోన్‌–1 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఈర్లె అనురాధతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో కూటమి మోసాలను, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా కృషి చేయాలన్నారు. ఓడినా, గెలిచినా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు సింహంలా సింగిల్‌గా పోటీ చేస్తారని, వారికి పార్టీ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. మహిళలకు నెలకు రూ.1500, యువతకు ఉద్యోగాలు, నెలకు రూ. 3వేలు నిరుద్యోగ బృతి, 50 ఏళ్లకే ఫించన్లు, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఎక్కడని నిలదీశారు. రెండేళ్లుగా ఒక కొత్త ఫించన్‌ ఇవ్వని కూటమి ఎన్నికలు వేళ పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించడం డ్రామా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాయ మాటలు నమ్మి మోసపోయామని ప్రజలు గ్రహించారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు ఈ ప్రాంత సమస్యలు పట్టవని, తమ ప్రభుత్వంలో రూ. 20 కోట్లతో సగానికి పైగా పనులు పూర్తి చేసిన కాశీపురం–గవరవరం తారు రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించలేక ఇరాన్‌ యుద్ధాన్ని సాగుగా చూపడంపై సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేను విమర్శిస్తున్నారన్నారు. తమ హయాంలో చరిత్రలో నిలిచేలా తారురోడ్లు, సీసీ రోడ్లు నిర్మించామన్నారు.

సమష్టిగా పోరాడాలి : శోభా హైమావతి

అనకాపల్లి పార్లమెంట్‌ పరిశీలకురాలు శోభా హైమావతి మాట్లాడుతూ సామాన్య కార్తకర్త నుంచి డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన బూడి ముత్యాలనాయుడు నీతి, నిజాయితీ, నిబద్ధతకు నిదర్శనమని, ఆయనను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. స్థానిక ఎన్నికల సమారానికి పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని, సమష్టి నిర్ణయంతో గెలిచే అభ్యర్థును ఎంపిక చేసుకోవాలన్నారు.

పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ బూటకం : పైలా శ్రీనివాసరావు

మాడుగుల నియోజకవర్గ పరిశీలకుడు పైలా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల వేళ పింఛన్ల దరఖాస్తులు స్వీకరించడం పెద్ద బూటకమని ధ్వజమెత్తారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేయని వెన్నుపోటు పార్టీ మోసాలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో బాధ్యతగా పని చేయాలన్నారు.

మాడుగుల కోటపై మళ్లీ వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలి : ఈర్లె అనురాధ

వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జోన్‌–1 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఈర్లె అనురాధ మాట్లాడుతూ ఐక్యతతో స్థానిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగించి మాడుగుల కోటపై వైఎస్సార్‌సీపీ జెండాను ఎగుర వేద్దామని కేడర్‌కు పిలుపునిచ్చారు. చంద్రబాబు వెన్నుపోటుకు కేరాఫ్‌ అడ్రస్‌ అని విమర్శించారు. కరువు, చంద్రబాబు కవల పిల్లలని, ఆయన పాలనలో నేడు రైతులు నాట్లు ఎండిపోయి దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అన్నారు. యాభై ఏళ్లకే ఫింఛనని మోసగించి బీసీ సభల పేరిట ఊదరకొట్టడం సిగ్గుచేటన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీలు చింతల బుల్లిలక్ష్మి, రెడ్డి జగన్‌మోహన్‌, తాళ్లపురెడ్డి రాజారామ్‌, జెడ్పీటీసీలు కర్రి సత్యం, లాలం శారదా జానకీరామ్‌, పార్టీ మండల అధ్యక్షులు బూరె బాబురావు, వేమవరపు రామధర్మజ(పెదబాబు), గొల్లవిల్లి రాజుబాబు, సీడీసీ చైర్మన్‌ సుంకరి శ్రీనివాసరావు, మాజీ మార్కెటింగ్‌ కమిటీ చైర్మన్‌ శానాపతి కొండలరావు, ఆర్టీఐ విభాగం జిల్లా అధ్యక్షుడు కెవి.రమణ, డా. వరదపురెడ్డి సింహాచలంనాయుడు, మండల యువజన అధ్యక్షులు కర్రి సూరినాయుడు, గొర్రుపొటు వెంకటరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వరదపురెడ్డి లలితానాయుడు పాల్గొన్నారు.

తారువ సమావేశంలో మాట్లాడుతున్న మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, భారీ సంఖ్యలో తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement