నీరు తగ్గింది...
గొలుగొండ : జలాశయం నీటి మట్టం గణనీయంగా తగ్గిపోవడంతో జాలర్ల వలలకు చేపలు దండిగా పడుతున్నాయి. పది రోజుల నుంచి జాలర్లకు కాసుల పంట పండుతోంది. ఎన్నడూ లేని విధంగా వర్షాలు లేకపోవడంతో ఉన్న నీటిని పంటలకు దిగువకు వదలడంతో చేపలు వేట అధికంగా సాగిస్తున్నారు. పట్టిన చేపలు, స్థానికంగా, నర్సీపట్నం మార్కెట్‌కు తరలించి జాలర్లు అమ్మకాలు చేస్తున్నారు. తాండవ జలాశయానికి గెడ్డల నుంచి చుక్క నీరు లేకపోవడం, జలాశయంలో నీరు పంటలకు వదలడంతో ఈ వేట సాగుతుంది.
450 మంది జాలర్లకు ఆధారం
తాండవ జలాశయంపై గొలుగొండ, నాతవరం మండలాలకు చెందిన 450 మందికి పైగా జలార్లు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గత నెల 11తేదీ వరకు కనీసం వేటకు వెళ్లలేని పరిస్థితి. జలాశయం నీటి మట్టం పూర్తి స్థాయిలో ఉండడం వల్ల జూన్, జులై, ఆగస్టు రెండో వారం వరకు ఈ వేటపై ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలు కనీసం వేటకు వెళ్లడం మానుకున్నారు. వెళ్లినా కనీసం 100 రూపాయలు చేపలు కూడా పడలేని పరిస్థితి. ఇటువంటి తరుణంలో ఆగస్టు 11 నుంచి నీటిని తాండవ జలాశయం దిగువన ఉన్న పంటలకు వదలడం జరిగింది. వారం రోజుల పాటు పెద్దగా వేటకు ఆసక్తి చూపని జాలర్లు 10 రోజుల నుంచి తిరిగి చేపల వేటపై ఆసక్తి చూపుతున్నారు. నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవడంతో చేపలు వలలకు అధికంగా చిక్కుతున్నాయి. తాండవ పరివాహక ప్రాంతాలు అయిన సాలికమల్లవరం, వెంకటాపురం, పొగచెట్లపాలెం, గొలుగొండ, జాలరుపేట, అమ్మపేట, గాదంపాలెంకు చెందిన ప్రాంతాల్లో ఒక్కసారిగా నీటిమట్టం తగ్గిపోవడం జరిగింది. కేవలం డ్యామ్‌కు కొంత దూరం వరకు నీటి మట్టం తగ్గిపోవడం వల్ల చేపల వేట అధికంగా సాగుతుంది.
మరో 15 రోజులు మత్స్యవేటకు పండగే
తాండవ జలాశయం నీటి మట్టం తగ్గిపోవడం, పైన వర్షాలు లేకపోవడం వల్ల పంటలకు పూర్తిగా నీరుని విడుదల చేస్తున్నారు. ఉన్న నీరు మరో 20 రోజుల పాటు విడుదలకు మాత్రమే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. జలాశయంలో నీరు ఎంత తగ్గి వాతావరణం వేడిగా ఉంటే చేపల వేటకు అంత అనుకూలంగా ఉంటుంది. పై గ్రామాల్లో ఉన్న మత్స్యకారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేట సాగిస్తే రూ.1500 వరకు వస్తుందని అంటున్నారు. మూడు నెలలు ఎటువంటి ఆధారం లేని తరుణంలో ప్రస్తుతం మత్స్యవేటకు వెళ్లేవారికి దండిగా చేపలు పడుతున్నాయని చెబుతున్నారు. వర్షం లేకపోవడం వల్ల రైతులకు నష్టం వచ్చినా జాలర్లకు మంచి మేలు జరుగుతుంది. ఈ నెలాఖరు వరకు ఇలాంటి పరిస్థితి ఉంటే జాలర్లకు కాసుల పంటే. ఈ జలాశయంలో బొర్ర, సీలావతి, గడ్డిపార, కొరమేలు రకాలు అధికంగా దొరుకుతుంటాయి.
గిరాకీ ఘనం..రుచి అమోఘం
తాండవ జలాశయంలో చేపల రుచి ఎక్కువ. సహజసిద్ధంగా జలాశయంలో దొరికే మేతను మాత్రమే తింటుంది. దీని వల్ల ఈ ప్రాంతంలో వీటికి అధికంగా డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం రెండు నుండి 5 కిలోల వరకు చేపలు పడుతున్నాయి. జూన్ వరకు కిలో 150 రూపాయలు ఉండగా ప్రస్తుతం వీటి ధరను 180 రూపాయలకు అమ్మకాలు చేసినా చేపల ప్రియులు ఉదయం జలాశయం వద్దకు వెళ్లి పోటీపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. రుచి అధికంగా ఉండడం, మూడు నెలల తరువాత చేపలు చిక్కడంతో ఇటు జాలర్లకు, ఇటు వినియోగదారులకు ఆనందం కలిగిస్తోంది.
చేపలు దండిగా పడుతున్నాయి...
మూడు నెలలు కనీసం ఒక్క చేప చిక్కలేదు. తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం, ఇటువంటి తరుణంగా జాలాశయం దిగువకు నీరు వదడం నీటిమట్టం చాలా వరకు తగ్గిపోవడం వలన చేపలు దండిగా వలలకు చిక్కుతున్నాయి. దీని కారణంగా మంచి ఆదాయం వస్తుంది. ఇటువంటి వాతావరణంలో మరో 15 రోజులు మరింత ఎక్కువ చేపలు చిక్కే అవకాశం ఉంది.
–అప్పన్న, సాలికమల్లవరం


