నర్సీపట్నం : నర్సీపట్నం, పెదబొడ్డేపల్లి, బలిఘట్ట మేజర్ పంచాయతీలను కలిపి నర్సీపట్నం పురపాలికగా 2013లో మారింది. రెండుసార్లు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. 2014లో చింతకాయల అనిత మొదటి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2021లో గుడబండి ఆదిలక్ష్మి, బోడపాటి సుబ్బలక్ష్మి చైర్‌పర్సన్‌లుగా ఎన్నికయ్యారు. పురపాలిక ఏర్పడి నాటి నుంచి ముగ్గురు మహిళలు చైర్మన్ పీఠాన్ని అధిరోహించారు. పురపాలిక ఏర్పడిన 13 సంవత్సరాల అనంతరం తొలిసారిగా ప్రజలు చైర్మన్‌ను నేరుగా ఎన్నుకొనే అవకాశం వచ్చింది. పురపాలక సంఘానికి రెండుసార్లు ఎన్నికలు జరిగితే ఒకసారి టీడీపీ, రెండోసారి వైఎస్సార్‌సీపీ పురపీఠాన్ని కై వసం చేసుకున్నాయి. చైర్మన్‌తో పాటు వైస్ చైర్మన్ ఎంపికకు సంబంధించిన విధి విధానాలను తాజాగా వెల్లడించారు.
పురపాలిక ఎన్నికలకు సంబంధించిన పనులు అధికార యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. కోర్టులో వేసిన పిటిషన్ కొట్టేయడంతో ఎన్నికలకు మార్గం సుగమం కావడంతో ఆయా ప్రక్రియలకు సంబంధించిన పనులు చేపట్టారు. పురపాలికలో గతంలో 28 వార్డులు ఉండగా పునర్విభజన అనంతరం 40 వార్డులు అయ్యాయి. వార్డుల విభజన, హద్దులకు సంబంధించిన ముసాయిదా వివరాలను పురపాలక కార్యాలయంలో సిద్ధం చేసి ఉంచారు. ఏయే వార్డు ఎంత వరకు ఉందో ఆయా వివరాలను పొందుపరిచారు. వార్డుల విభజన ప్రతిపాదనకు ఈ నెల 14న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వారీగా పునర్విభజన ప్రకారం చేయడం అత్యంత కీలకం. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పురపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలతో పాటు ఓటర్ల విభజన కొత్తగా ఉంటుంది. సంబంధిత ఓటరు ఏ వార్డులో ఉంటే అదే వార్డుకు సంబంధించిన అభ్యర్థికి ఓటు వేసే విధంగా విభజన ఉండాలి. పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటోలతో సహాయ ఓటర్ల వివరాలు విభజిస్తున్నారు. పట్టణంలో 2011 జనాభా గణన ప్రకారం 61,500 మంది ప్రజలు ఉన్నారు. ఒక్కో వార్డుకు 1500 నుంచి 1700 లోపు జనాభా ఉండేలా సర్దుబాటుతో పునర్విభజన చేపట్టారు. పురపాలక సంఘంలో మొత్తం 49,096 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 25,780, పురుషులు 23,312 మంది ఉన్నారు. ప్రస్తుతం ఉన్న 56 పోలింగ్ కేంద్రాలు 80 వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.


