బొజ్జన్నకొండ | - | Sakshi
Sakshi News home page

బొజ్జన్నకొండ

Sep 10 2026 12:45 AM | Updated on Sep 10 2026 12:45 AM

పురావస్తు రక్షిత స్థలంగా

సాక్షి , అనకాపల్లి : బొజ్జన్న, లింగాల కొండల్ని పురావస్తు రక్షిత ప్రాంతాలుగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్‌ తాజాగా విడుదల చేసింది. రాష్ట్రంలోని కొండారెడ్డి బురుజు, బొజ్జన్న కొండ, శాలిహుండం వంటి పురావస్తు ప్రదేశాల్ని పురావస్తు రక్షిత స్థలాలుగా గుర్తిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. దీనిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు పరిశీలించిన తర్వాత తుది నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్టు తెలుస్తుంది. ప్రాచీన స్మారకాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేష నియమాలు–1959’ పరిధిలో చేర్చే ప్రక్రియకు 23 ఎకరాల్లో విస్తరించి ఉన్న బొజ్జన్న కొండ, లింగాల కొండలకు సాంకేతిక అభ్యంతరాలు తలెత్తనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పురావస్తు రక్షిత స్థలాల గుర్తింపు ప్రక్రియపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పురావస్తు నిబంధనలు..

పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న బొజ్జన్న కొండకు పురావస్తు నిబంధనలు కాస్త సాంకేతిక ఇబ్బందుల్ని కలిగించనున్నాయి. 1958 పురావస్తు చట్టంలోని నిబంధనలే అడ్డంకి. చారిత్రాత్మక ఆధారాలుగా నిలుస్తున్న పురావస్తు కట్టడాలలో బౌద్ధక్షేత్రాలకు కీలక స్థానం ఉంది. ఆహ్లాదకరమైన వాతావారణంలో ఉండే బొజ్జన్నకొండ, లింగాల కొండల్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే డిమాండ్‌ కార్యరూపం దాల్చుతున్న క్రమంలో తాజా ప్రతిపాదనలు ఏ మేరకు అమలవుతాయో వేచి చూడాలి. పర్యాటక రంగ ఆశలపై పురావస్తుశాఖ నీళ్లు చల్లడం, కఠిన నిబంధనల్ని అమలు చేయడం పర్యాటక ప్రియులకు కంటగింపుగా మారడం తరచూ చూస్తున్న పరిణామమే.

వసతుల లేమి..పర్యాటకానికి అడ్డంకి...

అనకాపల్లి బొజ్జన్న కొండకు తరచూ విదేశీయులు వస్తుంటారు. ఇక్కడ చారిత్రక అవశేషాలు, సేదదీరేందుకు ఆహ్లాదకరమైన పార్కులు ఉన్నప్పటికీ బస చేసేందుకు సమీపంలో వసతులు, ఆహారం లభించకపోవడం పిక్నిక్‌ ప్రియుల్ని వేధించేది. బొజ్జన్న కొండను జాతీయ ప్రాధాన్యం కలిగిన స్మారకంగా, ప్రాచీన కట్టడంగా గుర్తించారు. పురావస్తు క్షేత్రాలు, శిథిల అవశేషాల పరిరక్షణ చట్టం 1958 ద్వారా గుర్తించారు. పురావస్తు చట్టం సవరించిన 2010 అధికరణం 30(1) ప్రకారం బొజ్జన్న కొండ పరిసరాలను నిషేధిత ప్రాంతం, క్రమబద్దీకరించిన ప్రాంతాలుగా గుర్తించారు. నిషేధిత ప్రాంతంలో ఎటువంటి నిర్మాణాలు, తవ్వకాలు చేపట్టరాదు. అదే విధంగా క్రమబద్దీకరించిన ప్రాంతం, సరిహద్దుకు 100 మీటర్ల దూరంలో పురావస్తు శాఖ అధికారుల అనుమతి తీసుకొని మాత్రమే కార్యక్రమాలు నిర్వహించాలి. పరస్పర అనుబంధంతో కూడిన పర్యాటక, పురావస్తు నిబంధల మేరకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మైనింగ్‌ ఆపగలరా...

వేల కోట్ల రూపాయల ఆదాయ మార్గమైన మైనింగ్‌ వల్ల బొజ్జన్నకొండ, లింగాల కొండలు ధ్వంసం అవుతున్నాయి. ఆ ఆనవాళ్లు గుహల్లో కనిపిస్తాయి. సమీప ప్రాంతాల్లో నిర్వహించే బ్లాస్టింగ్‌లే దీనికి కారణం. బొజ్జన్నకొండకు సమీపంలోని మార్టూరు సర్వే నంబర్‌ –1లో జరుపుతున్న క్వారీ బ్లాస్టింగ్‌లు ఇక్కడి శిలా సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఒక నివేదికను రూపొందించారు. బ్యూరో ఆఫ్‌ మైనింగ్‌ నివేదిక మేరకు బొజ్జన్న కొండకు మూడు నుంచి ఆరు కిలో మీటర్ల పరిధిలో ఎటువంటి గనుల తవ్వకాలు జరపరాదు. ఇది అమలైతే మార్టూరు పరిధిలోని 42 క్వారీల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.

కేంద్ర ప్రభుత్వ ముసాయిదా నోటిఫికేషన్‌లో చోటు

సమీప 3 కిలోమీటర్ల పరిధిలో 42 క్వారీలు నియంత్రణ సాధ్యమా..?

పర్యాటక ప్రాంతంగా గుర్తిస్తున్న క్రమంలో చారిత్రక అవశేషాలకు నష్టం

ఇదీ చారిత్రక విశిష్టత..

రెండు దశాబ్దాల చరిత్ర వున్న బొజ్జన్నకొండ 1906లో వెలుగులోకి వచ్చింది. 1906 అలెగ్జాండర్‌ రిమ్‌ బొజ్జన్నకొండపై నివేదిక ఇచ్చారు. ఆ సమయంలో బయటపడిన శాసనాలు, బౌద్దశిథిలాలు, అవశేషాలు ఆ నాటి చరిత్రను తేటతెల్లం చేశాయి. వడ్డాదిని రాజధానిగా చేసుకొని పరిసర ప్రాంతాలను పాలించిన అర్జునదేవుడు అవసానదశలో ఈ బొజ్జన్నక్షేత్రంలో నివశించారని ప్రతీతి.

బుద్ధుని కొండ పక్కనే వున్న అనేకమైన చైత్యాలతో కూడిన లింగామెట్టనే లింగాల కొండగా పిలుస్తున్నారు. ఇది మత్స్య ఆకారంలో కనిపించడం మరో విశేషం. దీనిని నమూనాగా తీసుకొని జావా ద్వీపంలో ‘బోరోబూదూరు’ బౌద్దక్షేత్ర నిర్మాణం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఇంతటి ప్రాధాన్యం వున్న బొజ్జన్నకొండను వీక్షించేందుకు, బౌద్ధమేళాలో పాల్గొనేందుకు రష్యా, జపాన్‌, చైనా, నేపాల్‌, బర్మావంటి దేశాల నుంచి తరచూ బౌద్ద భిక్షువులు వస్తుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement