ఎన్నికలప్పుడే టీడీపీ బీసీ పాట | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలప్పుడే టీడీపీ బీసీ పాట

Sep 10 2026 12:45 AM | Updated on Sep 10 2026 12:45 AM

నక్కపల్లి : బీసీలను మభ్యపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాత్రమే నర్సీపట్నంలో బీసీ సదస్సు నిర్వహిస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు గొర్ల నర్సింహమూర్తి ఆరోపించారు. బుధవారం ఆయన నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని టీడీపీ గొప్పలు చెప్పుకుంటోందన్నారు. ఈ హామీ ఎంతవరకు నెరవేర్చుతారో వేచి చూడాలన్నారు. 50 సంవత్సరాలు నిండిన బీసీలకు పెన్షన్‌ ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి రెండేళ్లయినా నెరవేర్చలేదన్నారు. వాస్తవంగా బీసీలకు వైఎస్సార్‌సీపీ హాయాంలోనే ఎక్కువ న్యాయం జరిగిందన్నారు. బీసీల్లో 53 ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి రాజ్యంగ బద్ధత కల్పించిన ఘనత వైఎస్సార్‌సీపీ దేనన్నారు. బీసీ కార్పొరేషన్లకు చైర్మన్‌లు, డైరెక్టర్లను నియమించి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఇచ్చారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి బీసీల పక్షపాతిగా నిలిచారన్నారు. ఎంపీపీలు, జిల్లాపరిషత్‌లు, ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ స్థానాలను సైతం బీసీలకు అధికంగా కేటాయించారన్నారు. బీసీల సంక్షేమం కోసం పోరాటం చేసిన ఆర్‌.కృష్ణయ్యకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారన్నారు. వీరిలో కొంతమంది అవకాశవాద రాజకీయాలకు పాల్పడి పార్టీని వీడారన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు బీసీల పాట పాడతారని, తీరా అధికారంలోకి వచ్చాక బీసీలను అణగదొక్కే ప్రయత్నాలే చేస్తారన్నారు. బీసీ నేతలైన కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్‌ సీదరి అప్పలరాజు, ఉమాశంకర్‌ గణేష్‌ వంటి వారిపై అక్రమ కేసులు బనాయించి కక్ష సాధిస్తున్నారన్నారు. బీసీలంతా టీడీపీ మాయలో పడొద్దన్నారు.

స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసమే బీసీ సదస్సు

వారి మాయలో పడొద్దు

వైఎస్సార్‌సీపీ హయాంలోనే బీసీలకు సముచిత న్యాయం

బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నర్సింహమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement