నాతవరం : కూటమి నేతల డైరెక్షన్‌లో పోలీసు బందోబస్తు మధ్య లేటరైట్ ప్రజాభిప్రాయ సేకరణను మమ అనిపించారు. మైనింగ్ మాఫియా ప్రలోభాల వల విసిరి ఎవరూ తమకు అడ్డు చెప్పకుండా చేసి లైటరైట్ తవ్వకాలకు రైట్ రైట్ అనిపించేశారు.. వివరాలివి. మండలంలో సుందరకోట పంచాయతీ శివారు బమ్మిడిక గ్రామ సమీపంలో జర్తా లక్ష్మణరావు పేరు మీద 121 హెక్టార్లలో లేటరైట్ తవ్వకాలు జరుగుతున్నాయి. దీనిని 10 వేల టన్నుల నుంచి 22,66,488 టన్నుల వరకు తవ్వకాలు పెంచేందుకు లక్ష్మణరావు దరఖాస్తు చేశారు. పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కొత్త శిరిపురం గ్రామంలో రామాలయం వద్ద బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభకు సుందరకోట పంచాయతీ శివారు 8 గ్రామాల్లో ముందు రోజు దండోరా వేయించి గిరిజనులంతా రావాలన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ప్రజాప్రాయ సేకరణ కావడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామసభకు వెళ్లేందుకు అడుగడుగునా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వెదురుపల్లి జంక్షన్, సరుగుడు, యరకంపేట గ్రామాల వద్ద ఎస్‌ఐలు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామసభకు వెళ్లే ప్రతి ఒక్కరినీ తనిఖీలు చేసి ఆధార్ గుర్తింపు కార్డులు చూసి పంపించారు. శిరిపురం గ్రామ సమీపంలో నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ ఆధ్వర్యంలో క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపించేవారు. ప్రజాప్రాయ సేకరణ గ్రామసభ జరిగే కొత్తపురంలో నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు ఉదయం 9.30 గంటల నుంచి సభ పూర్తి అయ్యేంత వరకు పలువురు ఎస్‌ఐలతో కలిిసి గ్రామమంతా కలియతిరిగారు. గ్రామసభ వద్ద నాతవరం ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు మహిళా పోలీసులు బందోబస్తు నిర్వహించి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడ్డారు. ఽలేటరైట్ లీజుదారుడైన జర్తా లక్ష్మణరావు ఇంతవరకు ఎంత మేర లేటరైట్ నిక్షేపాలు తవ్వకాలు చేశారు. అదనంగా ఎంత మేర తవ్వకాలకు అనుమతులు కావాలని అడిగిన అంశాలను గ్రామసభలో ముందుగా పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి జిల్లా అధికారి ముకుందరావు వివరించారు. నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ మాట్లాడుతూ గ్రామసభలో ప్రజల అభీష్టం మేరకే అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. మీ అభిప్రాయాలు గ్రామసభలో చెబితే ప్రతి ఒక్కరూ మాట్లాడిన అంశాలను వీడియా రికార్డింగ్ చేయడం జరుగుతుందన్నారు.
మైనింగ్ మాఫియాతోనే మేలు జరిగిందట!
ఈ సందర్భంగా మైనింగ్ మాఫియా పెట్టిన ప్రలోభాలకు లోనైన పలువురు గిరిజనులు, ప్రజాప్రతినిధులు లేటరైట్ తవ్వకాలకు అనుకూలంగా మాట్లాడారు. సుందరకోట మాజీ సర్పంచ్ కొండపల్లి రాజు, పీసా కమిటీ మాజీ కార్యదర్శి బత్తుల కృష్ణ, సరుగుడు మాజీ సర్పంచ్ పట్టెం రాజుబాబులతో పాటు అన్ని పార్టీల నాయకులు గ్రామసభలో ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. ప్రభుత్వం చేయలేని పనులు లేటరైట్ తవ్వకందారులు చేశారన్నారు. గ్రామాలకు రోడ్లు, తాగునీరు, విద్య, ఆరోగ్యం సదుపాయాలతో పాటు రేషన్, శుభకార్యాలకు పండగలకు డబ్బులు ఇస్తున్నారన్నారు. మాకు రానున్న కాలంలో నష్టం వాటిల్లినా, ఇప్పుడు పొందుతున్న లబ్ధి కారణంగా లేటరైట్‌కు వ్యతిరేకం కాదని తేల్చి చెప్పేశారు.
వామపక్షాలూ అదే మాట..
కమ్యూనిస్టు పార్టీల పాలసీ ప్రకారం లేటరైట్ తవ్వకాలకు తాము పూర్తి వ్యతిరేకమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలేపల్లి వెంకటరమణ, జిల్లా సీపీఎం కార్యవర్గ సభ్యుడు అడిగర్ల రాజు అన్నారు. ఇక్కడ గిరిజనుల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఈ ప్రాంత గిరిజనుల అభీష్టం మేరకు వదిలేశామని, లేటరైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా మాట్లాడలేమన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఒ.చందనరేఖ డిప్యూటీ ఎంపీడీవో కె.మూర్తిబాబు వివిధ శాఖలు అధికారులు స్వచ్ఛంద సంస్థలు సభ్యులు గిరిజనులు పాల్గొన్నారు.
నాడు మావోయిస్టుల అడ్డాలో
నేడు దర్జాగా గ్రామసభ
మావోయిస్టు ప్రభావిత గ్రామంలో లేటరైట్ తవ్వకాలకు ప్రజాప్రాయ సేకరణ గ్రామసభ నిర్వహించారు. ఒకప్పుడు ఈ గ్రామం తాండవ నాగులకొండ నక్సలైట్లు (నాడు మావోయిస్టులు) దళాలకు అడ్డాగా ఉండేది. ఆయా గ్రామాలకు వెళ్లాలంటే స్పెషల్ పార్టీ పోలీసులు ఆధ్వర్యంలో వెళ్లేవారు. క్రమేపీ ఈ ప్రాంతంలో మావోయిస్టులు కార్యకలాపాలు గత 25 ఏళ్లుగా కనిపించలేదు. ఈ నేపథ్యంలో లేటరైట్ నిక్షేపాల వల్ల పోలీసులు ఇపుడు ఆయా గ్రామాల్లో యథేచ్ఛగా పర్యటిస్తున్నారు.
పోలీసు బందోబస్తు నడుమప్రజాప్రాయసేకరణ
అడుగుడుగునా పోలీసుల తనిఖీలు
బయట వ్యక్తులు నిషేధం
మైనింగ్ మాఫియా ప్రలోభాల వల
గ్రామ సభలో అంతా అనుకూలం


