తుమ్మపాల : రైతులకు వేగంగా, పారదర్శకంగా రుణాలు అందించేందుకు జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద డిజిటల్ ‘కిసాన్ క్రెడిట్ కార్డ్‘ రుణాల పంపిణీ ప్రక్రియను కలెక్టరేట్ వీడియో కాన్ఫ్‌రెన్స్ హాల్‌లో బుధవారం కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ ’అగ్రిస్టాక్’ భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఈ డిజిటల్ విధానం ద్వారా అర్హులైన రైతులకు దరఖాస్తు చేసుకున్న 10 నిమిషాల్లోనే నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో రుణ మొత్తం జమ కానుందని తెలిపారు. జిల్లాలో దాదాపు 3 లక్షల మంది రైతుల డేటాను పరిశీలించి, అగ్రిస్టాక్ ఫిల్టరేషన్ ద్వారా ప్రాథమికంగా 80వేల మంది రైతులను కేసీసీ రుణాలకు అర్హులుగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. జాతీయ బ్యాంకుల ప్రతి శాఖకు కనీసం 100 మంది రైతులకు రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించామని, దరఖాస్తు ఆన్‌బోర్డ్ అయిన వెంటనే సిస్టమ్ ఆధారితంగా రుణం ఆమోదం పొంది 10 నిమిషాల్లో ఖాతాలో జమ అవుతుందన్నారు. రైతు సేవా కేంద్రాల వద్ద బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్లు, రుణ వితరణ అధికారులు సమావేశాలు నిర్వహించాలని, డిజిటల్ విధానంలో దరఖాస్తు ఎలా చేసుకోవాలో రైతులకు డెమో ద్వారా ప్రత్యక్షంగా వివరించాలన్నారు. జన్‌సమర్థ్ పోర్టల్‌లో ఇప్పటికే ఉన్న రూఫ్‌టాప్ సోలార్, ముద్రా, స్టార్టప్ పథకాలతో పాటు, ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలను కూడా డిజిటల్ ప్రక్రియ ద్వారా అందించడానికి ఈ పోర్టల్ అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆశా దేవి, సెంట్రల్ టీమ్ అధికారి స్వామి పాల్గొన్నారు.
స్వర్ణాంధ్ర –2047 విజన్‘పై శిక్షణ
మన రాష్ట్రాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టే దిశగా ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక స్థాయి నుంచి ఆర్థిక సూచీలు, అభివృద్ధి లక్ష్యాలను పర్యవేక్షించడంపై జిల్లా అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’స్వర్ణాంధ్ర – 2047’ విజన్‌లో భాగంగా కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులకు సామర్థ్య పెంపు కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. జిల్లా స్థూల ఉత్పత్తి, మండల స్థూల ఉత్పత్తి, గ్రౌండ్ వ్యాల్యూ యాడెడ్, పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సీపీవో రామారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మన అంగన్‌వాడీ – మన బాధ్యత’
ఈ నెల 9 నుంచి అక్టోబర్ 8 వరకు పోషణ మాసం కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. పోషణ మాసం–2026 కార్యక్రమాల్లో భాగంగా కలెక్టరేట్‌లో బుధవారం ‘మన అంగన్‌వాడీ – మన బాధ్యత’ పోషణ మాసం కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి పోషణ మాసం పోస్టర్‌ను ఆవిష్కరించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, ఆరోగ్య పరిరక్షణ, బాలల వికాసం, రక్తహీనత నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ, సాధికారిత అధికారిణి ఎన్.సూర్యాలక్ష్మి పాల్గొన్నారు.
పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన
కలెక్టర్ విజయకృష్ణన్


