అప్పన్న సన్నిధిలో సినీ దర్శకుడు శివ నిర్వాణ
లోవోల్టేజ్‌ను అధిగమించేందుకుసమ్మర్ యాక్షన్ ప్లాన్
నర్సీపట్నం : పల్లెలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు ఆర్డీఎస్‌ఎస్(రీవ్యాప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం) కింద గ్రామాల్లో త్రీఫేజ్ విద్యుత్ లైన్ల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని ఏపీఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.వి.రమణ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు త్రీఫేజ్ అవకాశం లేకపోవడంతో సరఫరాలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. వ్యవసాయానికి ఇస్తున్న తొమ్మిది గంటల సమయంలో మినహాయిస్తే మిగిలిన సమయం అంతా సింగిల్ ఫేజ్ సరఫరా అవుతోంది. దీంతో చిన్న, మధ్య తరగతి పరిశ్రమల నిర్వహణకు ఇబ్బందులు నెలకొన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్డీఎస్‌ఎస్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పల్లెలకు త్రీఫేజ్ సౌకర్యం కల్పిస్తున్నాయన్నారు. దీనిలో భాగంగా కొత్త విద్యుత్ లైన్లు వేస్తున్నామన్నారు. ఈ పనులు పూర్తయితే గ్రామాల్లోని అన్ని కేటగిరీలకు 24 గంటలపాటు త్రీఫేజ్ సరఫరా ఉంటుందన్నారు. రోజురోజుకు విద్యుత్ వాడకం పెరగడంతో దీర్ఘకాలంగా లోవోల్టేజ్ సమస్య వెంటాడుతోందన్నారు. నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా లోవోల్టేజ్ సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తిస్తున్నామన్నారు.
వంద శాతం రాయితీతో సౌర వెలుగులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌ను వందశాతం రాయితీతో అందిస్తున్నాయి. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద ఒక్కో ఇంటికి సుమారు రూ.1.25 లక్షలతో 2 కిలోవాట్ల సౌర విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. లబ్ధిదారులకు పక్కా భవనం ఉంటే స్లాబు మీద సోలార్ ప్యానెళ్లు బిగిస్తారు. పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా తెల్లరేషన్ కార్డు కలిగి, నెలకు 200 యూనిట్లులోపు విద్యుత్తు వినియోగించే ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ యూనిట్లు మంజూరు చేస్తున్నామన్నారు. డివిజన్ పరిధిలో 7,140 లక్ష్యం కాగా 4,500 ప్యానెల్స్‌ను బిగించామన్నారు. స్లాబ్ మీద సోలార్ ప్యానెళ్లు బిగించినందుకు లబ్ధిదారుకు నెలకు రూ.200 ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


