ఫ్లైయాష్‌ రవాణా | - | Sakshi
Sakshi News home page

ఫ్లైయాష్‌ రవాణా

Aug 10 2026 1:28 AM | Updated on Aug 10 2026 1:28 AM

ప్రాణసంకటంగా..
టోల్‌ఫీజును తప్పించుకునేందుకు రోడ్లపైనే అన్‌లోడింగ్‌

టోల్‌ప్లాజావద్ద రోడ్డుపై పడిన ఫ్లైయాష్‌ను తొలగిస్తున్న టోల్‌ ఎన్‌హెచ్‌ఏఐ కార్మికులు

నక్కపల్లి: పరవాడ ఎన్టీపీసీ నుంచి బూడిద (ఫ్లై యాష్‌) అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. పరిమితికి మించి లారీల్లో లోడ్‌ చేసి కాకినాడ తరలిస్తున్నారు. ఎన్టీపీసీ, రవాణాశాఖ అధికారులు పట్టించుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారు నిర్లిప్తంగా వ్యవహరించడానికి కారణమేంటి ? తదితర అనుమానాలు వ్యక్తమవుతున్నా ఉన్నతాధికారులు తగిన విధంగా స్పందించకపోవడంతో జాతీయరహదారిపై ప్రయాణించేవారు, సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

పెనాల్టీల నుంచి తప్పించుకునేందు..

రాజమండ్రి నుంచి గత కొద్దినెలలుగా బండరాళ్లను రాంబిల్లి ప్రాంతాలకు భారీ లారీల్లో తరలిస్తున్నారు. 40 టన్నులకు మించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ ఒక్కో లారీలో 80 టన్నుల వరకు లోడు వేసి టోల్‌ఫీజునుంచి తప్పించుకునేందుకు వేంపాడు, చందనాడ, ఉపమాక మీదుగా జాతీయరహదారిపై రాకపోకలు సాగిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో ఇవే లారీల్లో పరవాడ వద్ద ఉన్న ఎన్టీపీసీ నుంచి వెలువడే ఫ్లైయాష్‌ను కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. నిత్యం సుమారు 40 నుంచి 50 ట్రిప్పర్లలో ఈ బూడిదను 70 నుంచి 80 టన్నుల వరకు లోడింగ్‌ చేసి తీసుకెళ్తున్నారు. టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేసి, ఓవర్‌ లోడ్‌ కారణంగా రూ.5 వేల వరకు పెనాల్టీ వేస్తున్నారు. ఆ సొమ్ము చెల్లిస్తే తప్ప టోల్‌గేట్‌లో నుంచి అనుమతించడం లేదు. దీంతో డ్రైవర్లు లారీలను కొద్దిదూరం వెనక్కి తీసుకెళ్లి సగం ఫ్లైయాష్‌ను రోడ్డుపక్కన, జాతీయరహదారి మధ్యలో ఇష్టానుసారం అన్‌లోడ్‌ చేస్తున్నారు. కొన్ని లారీల డ్రైవర్లు టోల్‌ఫీజు నుంచి తప్పించుకునేందుకు మారుమూల గ్రామాలనుంచి రాకపోకలు సాగిస్తున్నారు.

భయం భయంగా...

జాతీయరహదారిపై రాకపోకలు సాగించే ద్విచక్రవాహన చోదకులు, ఆటోలు, బస్సుల్లో ప్రయాణించేవారి కళ్లల్లో ఈ బూడిద పడి నేత్ర సంబంధిత సమస్యలు వస్తున్నాయి. రోడ్డుపక్కన, మధ్యలో అన్‌లోడ్‌ చేసిన బూడిద విపరీతంగా వీచే గాలుల వల్ల ఆ ప్రాంతమంతా వ్యాపిస్తుండడంతో రోడ్డు కనిపించడం లేదు. దీంతో వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు.రోడ్డుపై వెళ్లాలంటే భయ పడుతున్నారు. కనీసం బండిపై ఫ్యామిలీని తీసుకు వెళ్లాలంటే ఆలోచించే పరిస్థితి ఏర్పడుతోంది.

భారంగా మారిన తొలగింపు

టోల్‌ప్లాజాకు సమీపంలో ఈ ఫ్లైయాష్‌ను అన్‌లోడ్‌ చేయడం వల్ల గాలులు వీచే సమయంలో బూడిద వచ్చి ప్లాజా వద్ద పేరుకుపోతోంది. దీంతో అక్కడి సిబ్బంది నిత్యం దానిని తొలగించవలసి వస్తోంది. రోడ్డుపై పడిన ప్‌లైయాష్‌ శుభ్రం చేసేందుకు కొంతమంది స్వీపర్లను ప్రత్యేకంగా వినియోగించాల్సి వస్తోంది. ఈ పని తలకు మించిన భారంగా మారుతోందని టోల్‌ప్లాజా సిబ్బంది చెబుతున్నారు.

ప్రమాదకరంగా రాకపోకలు

కళ్లలో పడి నరకయాతన పడుతున్న ప్రయాణికులు

పరిమితికి మించి ఎన్టీపీసీ నుంచి బూడిద తరలింపు

కూటమి నేతల

అండదండలతో యథేచ్ఛగా రవాణా

అధికారులు పట్టించుకోవడం లేదు

జాతీయరహదారిపై ఎక్కడికక్కడ ఫ్లైయాష్‌ను ట్రిప్పరు డ్రైవర్లు అన్‌లోడ్‌ చేస్తున్నారు. కాగిత సమీపంలో కూడా వేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్రవాహనాలపై వెళ్లేవారి కళ్లలో ఈ బూడిద పడుతుండడంతో నరకయాతన పడుతున్నారు. కంటిచూపు పోయే ప్రమాదం ఉందన్న భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఏడాదినుంచి ఈ దందా సాగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. టోల్‌ఫీజు తప్పించుకునేందుకు ఈలారీలు గ్రామాల్లోనుంచి రాకపోకలు సాగిస్తున్నాయి.

–పోతంశెట్టి బాబ్జి, కాగిత

పరవాడ ఎన్టీపీసీ ఫ్లై యాష్‌ (బూడిద) తరలింపు ప్రయాణికుల పాలిట ప్రాణసంకటంగా మారింది. గాలికి ఆ రేణువులు వాహన చోదకుల కళ్లలో పడుతుండంతో వారి బాధ వర్ణనాతీతంగా ఉంటోంది. కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడుతున్నారు. తరలించే సమయంలో తనిఖీలు నిర్వహించి అధిక పెనాల్టీలు విధిస్తుండడంతో వాటి నుంచి తప్పించుకునేందుకు రోడ్లపై ఎక్కడిపడితే అక్కడ బూడిదను డంప్‌ చేస్తుండడంతో రహదారుల్లో పరిస్థితి దారు ణంగా ఉంది.

కొంతమంది డ్రైవర్లు అధిక లోడుతో ఉన్న లారీలను ఉపమాక, చందనాడ, అమలాపురం, వేంపాడు మీదుగా జాతీయరహదారిపై చేరుకుని టోల్‌ప్లాజాను తప్పించుకుని వెళ్లిపోతున్నారు. అనుమతి లేని రహదారుల్లో మితిమీరిన బరువుతో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇలా గ్రామాల మధ్యలో నుంచి వెళ్లే సమయంలో బూడిద ఆ రోడ్లపై పడి గాలికి ఇళ్లలోకి చేరుతోంది. దీంతో ఆయా గ్రామాల వారు ఇబ్బందులకు గురతున్నారు. 80 టన్నుల బరువుతో లారీలు రాకపోకలు సాగించడం వల్ల గ్రామీణ రోడ్లు శిథిలమై... ఎక్కడికక్కడ గోతులు పడుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఫ్లైయాష్‌ రవాణా చేస్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఫ్లైయాష్‌ రవాణాకు ఉమ్మడి విశాఖ జిల్లా, కాకినాడ జిల్లాకు చెందిన కొంతమంది కూటమిపెద్దల అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement