కె.కోటపాడు: బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరుపై సందిగ్ధత కొనసాగుతోంది. ఇంటర్వ్యూలు నిర్వహించి 16 నెలలు గడిచినా ఇప్పటికీ ఒక్కరికి కూడా రుణం మంజూరు చేయలేదు. దీంతో నిరుద్యోగులు నిరాశనిస్పృహలకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2024–25కు సంబంధించి బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరుకు 2025 మార్చిలో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. మాడుగుల నియోజకవర్గం నుంచి 2,275 మంది దరఖాస్తు చేశారు.
కె.కోటపాడు మండలం నుంచి 645 మంది, దేవరాపల్లి మండలం నుంచి 520 మంది, చీడికాడ మండలం నుంచి 200 మంది, మాడుగుల మండలం నుంచి 910 మంది దరఖాస్తు చేసుకున్నారు. కె.కోటపాడు మండలంలో దరఖాస్తుదారులకు మండల పరిషత్ అధికారులు బ్యాంకర్లతో కలిసి 2025 ఏప్రిల్ 4న ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలు జరిగి సుమారు 16 నెలలు గడిచినా ఏ ఒక్కరికీ రుణం మంజూరు చేసిన దాఖలాలు లేవు.రుణాలు మంజూరవుతాయని, తద్వారా ఉపాధి పొందవచ్చని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 26 నెలలు గడుస్తున్నా ఒక్క ఏడాది కూడా రుణాలు మంజూరు కాలేదని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రుణాలు ఇవ్వాలి
బీసీ కార్పొరేషన్ రుణం కోసం దరఖాస్తు చేశా ను. ఇంటర్వ్యూకి కూడా హాజరయ్యాను. సబ్సిడీతో రుణం మంజూరు చేస్తే ఆటో కొనుగోలు చేయాలని అనుకున్నాను. ఇంటర్వ్యూలు పూర్త యి నెలలు గడుస్తున్నా ఏ ప్రకటనా రాలేదు.
– ఎల్.నర్సింగరావు, చౌడవాడ,కె.కోటపాడు మండలం


