గిరిజన సంక్షేమంపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

గిరిజన సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

Aug 10 2026 1:28 AM | Updated on Aug 10 2026 1:28 AM

● కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ● ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

నాతవరం: గిరిజనుల సంక్షేమం, అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించినట్టు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. మండలంలో సరుగుడు పంచాయతీ శివారు రామన్నపాలెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో జిల్లా స్థాయిలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివారం జిల్లా గిరిజన సంక్షేమాధికారి జి.మంగవేణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గిరిజనుల హక్కులను కాపాడేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో అనేక గిరిజనుల సమస్యలు పరిష్కరించామని, మిగతా వాటిని దశలవారీగా పరిష్కరిస్తామని చెప్పారు. పూర్వ ఆచారాలు పక్కన పెట్టి తమ పిల్లల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

పట్టుదలతో సాధించాను..

పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాను ఐఏఎస్‌ సాధించానని చెప్పారు. తమ స్వగ్రామం, తల్లిదండ్రుల పరిస్థితి, యూపీఎస్సీ పరీక్షలు రాసిన తీరు తదితర వివరాలను తెలిపారు. చదువుకోవడానికి పేదరికం అడ్డుకాదని, నేడు అనేక సదుపాయాలను ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని చెప్పారు. బాల్య వివాహాల జోలికి వెళ్లకుండా పిల్లలను బాగా చదివించాలని సూచించారు. నన్ను నా తల్లిదండ్రులు ప్రోత్సహించకపోతే నేను కలెక్టర్‌ను కాకపోయేదానిని అని అన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జి.మంగవేణి మాట్లాడుతూ జిల్లాలో నాబార్డు నిధులు రూ.9.66 కోట్లతో గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మించినట్టు చెప్పారు. 6,716 మంది గిరిజనుల ఇళ్ల వద్ద కుళాయిలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లాలో ఉన్న 22 గిరిజన పాఠశాలల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయన్నారు.

ఘన స్వాగతం

అంతకుముందు కలెక్టర్‌, ఇతర అధికారులకు గిరిజన సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. గ్రామ పొలిమేరలో తిలకం దిద్ది, హారతి ఇచ్చి పలు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఆశ్రమ పాఠశాలకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి కలెక్టర్‌ థింసా నృత్యం చేశారు. బాణం సంధించి, గిరిజన సంప్రదాయ సంగీత పరికరాలను వాయించి అందరినీ ఆకట్టుకున్నారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకించి విద్యార్థులతో ముచ్చటించారు. ఇంటర్మీడియెట్‌, పదవ తరగతి పరీక్షల్లో జిల్లాస్థాయిలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులనూ, గిరిజన పెద్దలను ఘనంగా సత్కరించారు. ముందుగా మొక్కలు నాటి జ్యోతిప్రజ్వలన చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ కరక సత్యనారాయణ, రాష్ట్ర కార్పొరేషన్‌ డైరెక్టర్లు రాజాన వీర సూర్యచంద్ర, వెలకాడ వెంకట కృష్ణారావు, కోండ్రు మరిడియ్య, జిల్లా మలేరియా అధికారి వరహాలదొర, తహసీల్దార్‌ చందనరేఖ, ఇన్‌చార్జి ఎంపీడీవో పోలుపర్తి పార్థసారథి, డిప్యూటీ తహసీల్దార్‌ టి.వి.ఎల్‌. రాజు, వైఎస్సార్‌సీపీ నాయకుడు బండి గంగరాజు, మార్కెట్‌ కమిటీ డైరెక్టరు పట్టెం రాజుబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement