అయ్యన్నా... ఇది తగునా ! | - | Sakshi
Sakshi News home page

అయ్యన్నా... ఇది తగునా !

Apr 12 2026 3:00 AM | Updated on Apr 12 2026 3:00 AM

స్పీకర్‌ తీరుపై తమ్ముడు సన్యాసిపాత్రుడి ఆగ్రహం

తన భూమిలో చెట్లు నరుకుతుంటే అడ్డుకుంటారా ?

స్పీకర్‌కు తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ మండిపాటు

సాక్షి, అనకాపల్లి: సొంత తమ్ముడు సన్యాసిపాత్రుడిపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడి వేధింపులు రోజురోజుకు మితిమీరుతుండడంతో రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా అయ్యన్న తీరు మారకపోవడంతో పలువురు ఆయన తీరును ఆక్షేపిస్తున్నారు. తాజాగా తన సొంత తోటలో సన్యాసిపాత్రుడు చెట్లు నరికిస్తుంటే పోలీసులతో అడ్డు కోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి సన్యాసిపాత్రుడు వ్యాపారాలను అడ్డుకోవడం, ఆయనపై అక్రమ కేసులు బనాయించడం.. ఇలా ఒకటి కాదు.. ఏదో ఒక విషయంలో ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. అందులో భాగంగా శనివారం తన సొంత భూమిలో పనులు చేసుకుంటుంటే అన్యాయంగా పోలీసులు అడ్డుకున్నారంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. సన్యాసిపాత్రుడు సొంత భూమిలో తోట నరికే పనులు చేసుకుంటుంటే రూరల్‌ సీఐ రేవతమ్మ పంపించారంటూ ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు వచ్చి.. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తోటలో మీరు ఎలా నరుకుతారు అంటూ అడిగారు. రికార్డులు ఉన్నాయా...? అంటూ హైడ్రామాకు తెరతీశారు. ట్రాక్టర్లను స్టేషన్లకు తరలించారు. ఎందుకు అడ్డుకుంటున్నారంటూ సన్యాసిపాత్రుడు ప్రశ్నించినా సీఐ రేవతమ్మ, డీఎస్పీ శ్రీనివాసరావు నుంచి సమాధానమే లేదు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలీసుల హైడ్రామా నడిచింది. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ నేతలు పోలీసుస్టేషన్‌ వద్దకు చేరుకున్నారు.

వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ విభాగం, మాజీ కౌన్సిలర్‌ మాకిరెడ్డి బుల్లిదొర, వైఎస్సార్‌సీపీ నాయకులు వచ్చి పోలీసులు ప్రశ్నించగా..సమాధానం చెప్పకపోగా సీఐ రేవతమ్మ, ఎస్‌ఐ రాజారావు నెమ్మదిగా జారుకున్నారు. ట్రాక్టర్లు పోలీసుస్టేషన్‌ వద్దనే ఉన్నాయి. ఫిర్యాదు ఎవరు చేశారు.? అని ప్రశ్నించగా ఎటువంటి సమాధానం లేదంటూ న్యాయవాది వెల్లడించారు.

మా భూమిలో తోట నరుకుతుంటే

ఎందుకు అడ్డగిస్తున్నారు

పోలీసులు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు మండిపడ్డారు. గబ్బాడ పంచాయతీలో తమకు వారసత్వంగా సంక్రమించిన భూమిలో తోట నరికే పనులు చేపట్టామన్నారు. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుతో సహా నలుగురు అన్నదమ్ములకు ఒక్కొక్కరికీ 1.40 ఎకరాల భూమి దాఖలు పడిందన్నారు. అందుకు సంబంధించి 2023లో రీ సర్వే జరిగి, పట్టాదారు పాస్‌ పుస్తకాలు వచ్చినట్టు చెప్పారు. వాటి ఆధారంగానే అయ్యన్నపాత్రుడు వాటాకు వెళ్లిన భూమిని వదిలేసి, మిగతా ముగ్గురం కలిసి తోట నరికే పనులు చేపట్టామన్నారు. ఈ సమయంలో రూరల్‌ సీఐ రేవతమ్మ పంపించారంటూ కానిస్టేబుళ్లు వచ్చి ఆ భూమిలో ఉన్న ట్రాక్టర్లను స్టేషన్‌కు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా భూమిలో తోట నరుకుతుంటే ఎందుకు అడ్డుకు న్నారని సీఐని అడిగితే సమాధానం లేదన్నారు. ఇదే విషయాన్ని డీఎస్పీ శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు ఎవరు చేశారని అడిగినా పోలీసులు స్పందించటం లేదన్నారు. సుమారు ఐదు గంటలకు పైగా తాను, తన కుమారుడు వరుణ్‌ స్టేషన్‌ దగ్గరే ఉన్నప్పటికీ కనీసం సమాధానం చెప్పేవారు స్టేషన్‌లో లేకపోవడం దారుణమన్నారు. అనంతరం మీడియాను తీసుకుని తన భూమిలోకి వెళ్లి సరిహద్దులను స్పష్టంగా చూపించారు. వైఎస్సార్‌సీపీలో ఉన్నామనే అక్కస్సుతోనే స్పీకర్‌ ఆదేశాలతో పోలీసులను అడ్డం పెట్టుకుని తమను స్పీకర్‌ వేదిస్తున్నారని ఆవేదన చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement