అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయ హుండీ ఆదాయాన్ని శనివారం లెక్కించారు. గత నెల 11 నుంచి ఈనెల 10వ తేదీ వరకు రూ.80,17,580 ఆదాయం రాగా, బంగారం 9 గ్రాముల 100 మిల్లీ గ్రాములు, వెండి 710 గ్రాములు లభించినట్టు దేవదాయశాఖ ఉప కమిషనర్ ఎన్.సుజాత చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి నూతన ఆలయానికి భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోందన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్ కె.ఎల్.సుధారాణి, ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్, చైర్మన్ పీలా నాగశ్రీను, దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్ వంసతరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


