అనారోగ్యంతో
అచ్యుతాపురం రూరల్: మండలకేంద్రం అచ్యుతాపురంలో గల కేజీబీవీలో ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని శనివారం మృతి చెందింది. తమ కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుంటే పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు సకాలంలో చికిత్స అందించకపోవడం వల్ల మరణించిందని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తూ పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబసభ్యులు, అధికారులు తెలిపిన వివరాల మేరకు.. అచ్యుతాపురం మండలం పూడిమడక శివారు కడపాలెం గ్రామంలోని దోనోడుదిబ్బ వీధికి చెందిన మత్స్యకారులైన మైలపల్లి రాజు, ఎల్లమ్మ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె సంతానం. కుమారుడు అచ్యుతాపురంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతుండగా, కుమార్తె మైలపల్లి నవ్య (12) అచ్యుతాపురం కేజీబీవీలో ఏడో తరగతి చదువుతోంది. శనివారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో నవ్య తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి, తనకు మెడభాగంలో చాలా నొప్పిగా ఉందని తెలిపింది. అయితే తగ్గిపోతుంది, కంగారు పడకండి అని ఆమే తల్లిదండ్రులకు ధైర్యం చెప్పింది. అనంతరం గంటలోపే ఉదయం 5.15 గంటలకు పాఠశాల సిబ్బంది ఫోన్ చేసి, మీ అమ్మాయి ఆరోగ్యం బాగోలేదు, మా దగ్గర వాహనం లేనందున మీరే వచ్చి, ఆస్పత్రికి తీసుకెళ్లండని తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. దీంతో గ్రామం నుంచి వచ్చిన తల్లిదండ్రులు నవ్యను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కేజీహెచ్‌కు తరలించినప్పటికే బాలిక మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
కటిక నేలపై నిద్ర...
సక్రమంగా అందని పోషకాహారం
అసౌకర్యాలు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పాఠశాలలో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు పలువురు ఆరోపించారు. డార్మెటరీలో మంచాలు ఉన్నప్పటికీ విద్యార్థినులు కిందనే పడుకోవలసి వస్తోందని, అక్కడే కూరగాయలు, ఇతర సామగ్రి ఉండడంతో పాటు తరచూ విష కీటకాలు సంచరిస్తుండడంతో వారు తీవ్ర భయాందోళనల మధ్య చదువులు సాగించవలసి వస్తోందని తెలిసింది. పరిశుభ్రత, సరైన వసతి లేకపోవడంతో పాటు పోషకాహారాన్ని సక్రమంగా అందించడం లేదని గతంలో ఆరోపిస్తూ పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాల నుంచి తీసుకెళ్లిపోయారని సమాచారం. ఎవరైనా తల్లిదండ్రులు పాఠశాల నిర్వహణ సరిగా లేదని ప్రశ్నిస్తే వారిపై కేసులు పెడతామని సిబ్బంది, అధికారులు బెదిరిస్తున్నట్టు తెలిసింది
గతంలో అనుమానాస్పదంగా విద్యార్థిని మృతి
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ పాఠశాలకు చెందిన ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన జరిగిందని స్థానికులు గుర్తు చేసుకున్నారు.
భారీ ఎత్తున ఆందోళన
తమ కుమార్తె మృతికి కేజీబీవీ సిబ్బందే కారణమని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు పాఠశాల వద్ద శనివారం భారీ ఎత్తున ఆందోళన చేశారు. తమ కుమార్తెకు వైద్య సేవలందించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని, గ్రామం నుంచి తామే వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లవలసి వచ్చిందని వారు తెలిపారు. శుక్రవారం తన ఆరోగ్యం బాగోలేదని తమ కుమార్తె చెప్పిందన్నారు. ఆస్పత్రికి తీసుకెళతామని పంపాలని కోరితే పరీక్షలు జరుగుతున్నాయని, పంపడం కుదరదని సిబ్బంది చెప్పడంతో తండ్రి రాజు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోవలసి వచ్చిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారమే ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే తమ కుమార్తె బతికేదని వారు రోదిస్తూ చెప్పారు. నవ్య మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నవ్య మృతిపై అనుమానాలున్నాయని, ఎందువల్ల మృతి చెందిందో తెలియడం లేదని, ఉన్నతాధికారులు విచారణ జరపాలని, మృతురాలి కుటుంబానికి చెందిన మైలపల్లి జగదీశ్ తదితరులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పరవాడ డీఎస్పీ బి.మోహన్‌రావు, సీఐ చంద్రశేఖరరావు, ఎస్‌ఐ సుధాకరరావు పాఠశాల వద్దకు చేరుకుని విద్యార్థిని తల్లిదండ్రులకు సర్ది చెప్పారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మృతిరాలి తల్లి ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


