మహారాణిపేట(విశాఖ): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవాన్ని అత్యంత వైభవంగా, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలని రాష్ట్ర మంత్రులు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత కలిసి ఈ నెల 20న జరగనున్న చందనోత్సవ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణకు జిల్లా కలెక్టర్‌ను స్పెషల్ ఆఫీసర్‌గా, దేవదాయ శాఖ కమిషనర్‌ను ఇన్‌చార్జి స్పెషల్ ఆఫీసర్‌గా నియమించినట్లు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. వీఐపీలు దర్శనానికి ఉదయం 5 గంటల వరకు సమయం కేటాయించగా, అనంతరం సామాన్య భక్తులకు ఉచిత దర్శనం, చెల్లింపు దర్శనాలు సజావుగా జరిగేలా చూడాలని సూచించారు. అంతరాలయ దర్శనం విషయంలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ దర్శనానికి దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, వారందరికీ సజావుగా దర్శనాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఘాట్ రోడ్లు, క్యూలైన్ల వద్ద గందరగోళం లేకుండా పోలీసులు ప్రత్యేక వ్యూహంతో వ్యవహరించాలన్నారు. సమావేశంలో దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్ లాల్, కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, దేవస్థానం ఈవో వెంకటరావు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
చందనోత్సవం ఏర్పాట్ల పరిశీలన
సింహాచలం: సింహగిరిపై చందనోత్సవం ఏర్పాట్లను రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి శనివారం పరిశీలించారు. ఆలయ నీలాద్రిగుమ్మం వద్ద ఏర్పాటుచేసిన ర్యాంపులపై నిలబడి భక్తులకు స్వామివారి మూలవిరాట్ సరిగ్గా కనిపిస్తున్నారా...లేదా.. అని పరిశీలించారు. నీలాద్రిగుమ్మం వద్ద నుంచే భక్తులందరికీ లఘు దర్శనం ఇస్తుండటంతో భక్తులు ఏయే లైన్లలో వెళ్తారో ఆరా తీశారు. ఈ సందర్భంగా స్వామిని మంత్రులు దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, అదితి గజపతిరాజు, దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్‌లాల్, కమిషనర్ రామచంద్రమోహన్, కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ తదితరులు ఉన్నారు. పంచగ్రామాల భూసమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుని ఆ వివరాలను హైకోర్టు ముందు ఉంచామని, మంత్రి ఆనం తెలిపారు.
చందనోత్సవ ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్ష


