గుడిలో బడి | - | Sakshi
Sakshi News home page

గుడిలో బడి

Apr 12 2026 3:00 AM | Updated on Apr 12 2026 3:00 AM

శిథిలమైన పాఠశాల భవనాలు

అసంపూర్తిగా నిర్మాణాలు

పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం

అవస్థలు పడుతున్న విద్యార్థులు

చెట్లకింద బెంచీలు

ఆరుబయట మధ్యాహ్నభోజనం తయారీ

కోనవానిపాలెం రామాలయంలో తరగతులు నిర్వహిస్తున్న దృశ్యం

నక్కపల్లి/ఎస్‌రాయవరం : గత ప్రభుత్వం నాడు నేడు పథకం కింద మంజూరు చేసిన భవనాలను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిచేయకపోవడంతో విద్యార్థులు పరాయి పంచన పాఠాలు నేర్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సరైన వసతి లేక రామాలయంలో మొక్కుబడిగా తరగతులు నిర్వహిన్నా రు. ఒకే వరండాలో మూడు తరగతుల పిల్లలను కూర్చోబెట్టి బోధన చేస్తున్నారు. జాతీయరహదారికి సమీపంలో ఎస్‌.రాయవరం మండలం కోనవానిపాలెంలో గల పాఠశాల దుస్థితి ఇది. 1నుంచి 5 తరగతుల వరకు 27 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. ఒక్కో గదితో రెండు చిన్నభవనాలు ఉన్నాయి. ఈభవనాలు శిథిలావస్థకు చేరడంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాడు నేడు ఫేజ్‌2 కింద రూ.40 లక్షలు మంజూరయ్యాయి. నాటి ఎమ్మెల్యే గొల్ల బాబూరావు 2022లో నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శ్లాబ్‌ వరకు భవనాన్ని నిర్మించారు. ఎన్నికల కోడ్‌ రావడంతో భవనాలను అసంపూర్తిగా వదిలేశారు.తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఈ భవనాలను పూర్తిచేయలేదు. దీంతో 1,2,5 తరగతులకు చెందిన 16 మంది విద్యార్థులను రామాలయంలోను 4వ తరగతికి చెందిన 11 మందిని మరో భవనంలోను కూర్చోబెట్టి బోధిస్తున్నారు.ఈ భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. శ్లాబ్‌పెచ్చులు రాలిపోతుండడంతో విద్యార్థులు భయాందోళనలు చెందుతున్నారు.

చెట్ల కింద బెంచీలు...ఆరు బయట వంటలు

గత ప్రభుత్వంలో భవనాల కోసం సరఫరా చేసిన సిమెంట్‌, ఐరన్‌ పక్కనే ఉన్న షెడ్లలో నిర్లక్ష్యంగా వదిలేశారు. ఐరన్‌ తుప్పుపట్టడం సిమెంట్‌ రాయిలా మారిపోయింది. విద్యార్థుల కోసం సరఫరా చేసిన బెంచీలను చెట్ల కింద నిర్లక్ష్యంగా వదిలేశారు. వంట షెడ్డు లేకపోవడంతో విద్యార్థుల కోసం ఆరుబయట మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్నారు. పాఠశాల భవనాలను పూర్తిచేయడానికి రూ.12 లక్షలు అవసరమవుతుంది. చంద్రబాబు ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేయకపోవడం వల్లే తమ పిల్లలు రామాలయంలో చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడిదంటూ తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత నివాసానికి కూత వేటు దూరంలోనే ఈ పాఠశాల ఉండటం గమనార్హం.

గ్రామంలో ఎవరైనా చనిపోతే సెలవే

గ్రామంలో ఎవరైనా చనిపోతే రామాలయంలో నిర్వహించే తరగతులకు సెలవు ప్రకటించాల్సిందే. దహన సంస్కారాల అనంతరం గ్రామస్థులు వచ్చి రామాలయంలో కొద్దిసేపు కూర్చొవడం ఆనవాయితీ. ఈ సమయంలో విద్యార్థులను బయటకు పంపడం లేదా ఇంటికి పంపేయడం చేస్తున్నారు. తమ పాఠశాల నూతన భవనాలను పూర్తి చేసి తమకు వసతి సదుపాయం కల్పించడంతోపాటు, నాణ్యమైన బోధన అందించాలంటూ చిన్నారులు కోరుతున్నారు

గత్యంతరం లేకే ..

ఉన్న రెండు భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఒకటి పూర్తిగా పాడవడంతో గత్యంతరం లేక రామాలయంలో తరగతులు నిర్వహిస్తున్నాం. నిధుల కొరత కారణంగా భవనాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. త్వరగా పూర్తిచేస్తే ఈ ఇబ్బందులు తొలగిపోతాయి. ఉన్నతాధికారులకు నివేదిక పంపించడం జరిగింది.

– మయూరి, హెచ్‌ఎం, కోనవానిపాలెం పాఠశాల

శిథిలావస్థకు చేరిన భవనాలు... పెచ్చులూడుతున్న శ్లాబు.. రెండు ఇరుకు గదులు...ఇదీ ఎస్‌.రాయవరం మండలం కోనివాని పాలెం పాఠశాల దుస్థితి. వీటిలో బితుకుబితుకుమంటూ ఆ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు చాలారోజులు కాలం వెళ్లదీశారు. గత్యంతరం లేక.. శిథిలమైన భవనంలో తరగతులు నిర్వహించలేక సమీపంలోని గుడినే బడిగా చేసుకున్నారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు, మరుగుదొడ్లు కూడా లేవు. వంటశాల లేక మధ్యాహ్న భోజనాన్ని ఆరుబయట తయారు చేయాల్సి వస్తోంది. అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనం గురించి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement